కులతత్వం, దురహంకార హత్యలపై ఒకవైపు తీవ్ర ఆందోళనలు కొనసాగుతుండగానే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది.కులాంతర వివాహం చేసుకున్న కూతురిపై కన్నతండ్రే హత్యాప్రయత్నం చేశాడు.మిర్యాలగూడ ప్రణయ్ కులహత్య ఘాతుకాన్ని మరవరక ముందే హైదరాబాద్‌లో అలాంటి దారుణం జరిగింది.హైదరాబాద్ నడిరోడ్డుపై పట్టపగలే నవదంపతులపై వేటకొడవలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఎర్రగడ్డకు చెందిన ఎస్సీ యువకుడు బల్ల నవదీప్, బోరబండకు విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మాధవి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఈ నెల 12న బోయిన్పల్లి ఆర్యసమాజ్‌లో ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని తండ్రి మాధవిపై వేటకొడవలితో అతి దారుణంగా దాడిచేసాడు.అల్లుడు, కుమార్తెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.తమకు ప్రాణహాని ఉందని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మాధవి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. దీంతో మాధవి తండ్రి మరింత రగిలిపోయాడు. తమకు ప్రాణాలకు హాని ఉందని నవదీప్, మాధవి మీడియాకు కూడా చెప్పారు.
టీవీల్లో వారి మాటలు విన్న మాధవి తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. అమ్మాయి తండ్రి ఈరోజు పథకం ప్రకారం హత్యకు యత్నించాడు.రెండు హత్యల్లో కత్తి దూసింది కులమే. రెండు చోట్ల విలవిలలాడింది ప్రేమజంటలే. రెండు ప్రేమ జంటల్లో అమ్మాయి అగ్రవర్ణాలకు చెందినవారు కాగా అబ్బాయిలు దళిత వర్గానికి చెందిన వారు కావడం. రెండు ఘటనల్లోనూ నిందితుడు అమ్మాయి తండ్రే.