జిల్లాలో గ్రామ గ్రామాన మరోమారు ప్రచారం నిర్వహించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.వచ్చే సంవత్సరం జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ‘రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ ఇంటింటికీ తిరిగి, జగన్ గతంలో ప్రకటించిన ‘నవరత్నాలు’ హామీలతో జరిగే లబ్దిని గురించి వివరించాలని నిర్ణయించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే, జరిగే మేలును వైసీపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు.
అదే సమయంలో అధికార పార్టీ శాసన సభ్యులు, ముఖ్యనేతలతో పాటు గ్రామస్థాయి నేతల దోపిడీని ఎత్తి చూపనున్నారు. పనులు చేయకుండానే ప్రజాధనాన్ని దోచుకుతినడం, సంక్షేమ పథకాలను అర్హులకు కాకుండా అనర్హులకు అప్పగించడం, ప్రతి పనిలోనూ కమీషన్లు పుచ్చుకోవడం తదితర అక్రమాలను ప్రజల ముందుంచనున్నారు. ఎన్నికల సమయంలోనూ ఆ తరువాత స్థానిక నేతలతోపాటు ముఖ్యమంత్రి జిల్లాకు ఇచ్చిన వందలాది హామీలను పట్టించుకోకపోవడాన్ని వైఎస్సార్ సీపీ నేతలు ప్రజలకు గుర్తు చేయనున్నారు.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన పనులు తప్ప నాలుగున్నరేళ్ల పాలనలో మిగిలి ఉన్న అరకొర పనులను చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడాన్ని ప్రజలకు వివరించనున్నారు.
జిల్లాలో సోమవారం నుంచి మూడు నెలల పాటు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి నెలా 20 రోజులకు తగ్గకుండా నేతలు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పార్టీ నేతలు ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లి జనంలో ఉండి ప్రచారం చేస్తారు.జగన్ పాదయాత్ర జరగనున్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా, మిగతా జిల్లాల్లోని 168 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి సమన్వయకర్తా, నిత్యమూ కనీసం రెండు పోలింగ్ బూత్ ల పరిధిలోని ఇళ్లకు వెళ్లి, అక్కడి ఓటర్లతో మాట్లాడాల్సివుంటుంది. ఇలా నెలలో కనీసం 50 పోలింగ్ బూత్ ల పరిధిలోని అన్ని ఇళ్లకూ వెళ్లాలి. ఎక్కడైతే బూత్ కమిటీల నియామకం జరగలేదో, వాటిని వారం రోజుల్లో పూర్తి చేసి ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగన్ ఆదేశించారు.