తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలు జట్టుకట్టిన మహాకూటమి ఆదిలోనే నవ్వుల పాలవుతోందా? కూటమిలోని పార్టీలకు ఒకరిపై మరొకరికి నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందా? తెలంగాణ జనసమితి నేత కోదండరాంపై పలువురు నేతలు అనుమానపు చూపులు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సీట్ల పంపకం ఎపిసోడ్‌లో ఈ చర్చ తెరమీదకు వస్తోంది.
కాంగ్రెస్ సారథ్యంలో కూటమి ఏర్పడుతుండగా…తమ స్వార్థపు రాజకీయ ఎజెండాలో భాగంగా టీడీపీ, సీపీఐలతో పాటు టీజేఎస్ కూడా కూటమిలో చేరేందుకు ఓకే అన్నాయి. అయితే సీట్లు సర్దుబాటుపై ఇంకా అవగాహన కుదరలేదు. టీడీపీ, సీపీఐ.. తాము బలంగా ఉన్నచోట్ల సీట్లు కావాలంటుంటే… టీజేఎస్ మాత్రం తమ ఎజెండాకు ఓకే చెబితేనే కూటమిలో చేరుతామంటోంది. కూటమిలో భాగం కావాలంటే, తమకు కనీసం 30 నుంచి 35 సీట్లు ఇవ్వాలని కూటమిని డిమాండ్ చేస్తోంది. టీజేఎస్‌కు తెలంగాణలో 15 శాతం ఓటుబ్యాంకు ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే, ఈ డిమాండ్‌పై ఇటు కాంగ్రెస్, అటు టీడీపీలోని నేతలు భగ్గుమంటున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీలైన తామే ఇన్ని సీట్ల డిమాండ్ చేయడం లేదని అలాంటి పరిస్థితుల్లో 30 సీట్లు పార్టీగా రూపుదిద్దుకోని వేదికకు ఎలా ఇస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. పలువురు నేతలైతే పొత్తుల ప్రక్రియల ఇలా బ్లాక్ మెయిల్ చేయడం ఏంటని వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. మొత్తంగా మహాకూటమి ఆదిలోనే విబేధాలకు వేదికగా మారిందని అంటున్నారు.