రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ పాల నపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న నేపధ్యంలో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది.
ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో టీడీపీ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతప్తితో ఉన్నట్టు తేలింది. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని,ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష వైకాపా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కానున్నారని చెప్పారు.
ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్‌లో ‘పొలిటికల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్దేశాయ్, రాహుల్ కన్వల్ నిర్వహించారు. ఇండియా టుడే సర్వేలో భాగంగా తదుపరి సీఎం ఎవరన్న సూటి ప్రశ్నకు 43 శాతం మంది జగన్ సీఎం కావాలని కోరుతున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు పనితీరుపై 38 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ వైపు కేవలం 5 శాతం మందే మొగ్గు చూపారు.
ఈ చర్చలో పాల్గొన్న యాక్సిస్ మై ఇండియా ప్రతినిధి ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు 44.35% ఓట్లు రాగా టీడీపీకి బీజేపీతో కలుపుకుని 46% ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు.మిగతా రాష్ట్రాల్లో ప్రతిపక్షనాయకుల కంటే సీఎంలకే ఎక్కువ ప్రజాదరణ ఉందని చెప్పారు. పొలిటికల్ సైంటిస్ట్ సందీప్ శాస్త్రి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పడే అవకాశాలున్నాయన్నారు.