ప్రేమించి పెళ్లాడిన తన భర్త ప్రణయ్ ఇక లేడనే విషయం తెలియగానే అతడి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రణయ్ పై దాడి జరగటానికి ముందు మా నాన్న ఫోన్ చేశాడని… నన్ను అబార్షన్ చేయించుకొమ్మని ఫోర్స్ చేశాడని… తాను ఒప్పుకోలేదని కన్నీరుమున్నీరైంది.ఆస్పత్రిలో ఉన్న అమృతను పరామర్శించేందుకు వచ్చినవారి ముందు విలపిస్తూ… నా కళ్ల ముందే ప్రణయ్‌ని హత్య చేశారంటూ విలపించింది అమృత.
తన కళ్ల ఎదుటే ప్రణయ్‌ను నరికి చంపించిన తన తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. హంతకుడు తన తండ్రైనా సరే ఉరి తీయాల్సిందే అని అమృత పట్టుబడుతోంది.జ్యోతి ఆస్పత్రిలో చిక్సిత్స పొందుతున్న అమృతను ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఇతర నేతలు పరామర్శించారు.
తెలంగాణలో ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. పెరుమాళ్ల ప్రణయ్‌ను హత్యకు సూత్రధారిగా భావిస్తున్న అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, అతడి తమ్ముడు శ్రవణ్ హైదరాబాద్ వైపు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే నల్లగొండ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు ప్రణయ్ ఇంటి ముందున్న సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. హంతకుడు గత నెల 22న కూడా ప్రణయ్ కారును ఫాలో అయినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. దుండగుడు బైకుపై ప్రణయ్ కారును అనుసరించినట్టు స్పష్టంగా కనబడింది. ఇతడే జ్యోతి ఆస్పత్రి వద్ద ప్రణయ్‌ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.