ఆఖరి టెస్టులో టీమిండియా పరాజయంతో ముగించింది. అది కూడా కాస్త గౌరవప్రదంగా! కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో సోమవారమే ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయి… గెలుపు కాదు, ‘డ్రా’ కూడా అసాధ్యమనే పరిస్థితుల మధ్య మంగళవారం ఆట ఐదో రోజు బరిలో దిగిన మన జట్టు అద్వితీయంగా పోరాడింది.కేఎల్ రాహుల్ (224 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్ 149), రిషభ్ పంత్ (146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 114) శతకాల సహాయంతో గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించారు.ఆరో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఈ జోడీ ఆశలు రేకెత్తించింది.
కానీ, కీలక సమయంలో ఆదిల్ రషీద్ (2/63) చక్కటి బంతితో రాహుల్‌ను ఔట్ చేసి భారత్ ఆశ లకు తెరదించాడు. ఆ వెంటనే పంత్‌నూ పెవిలియన్ పంపి ఆతిథ్య జట్టు విజయానికి ఊపిరి పోశాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు మినహా అన్నింటిని గెల్చుకున్న ఇంగ్లండ్ 4–1తో సిరీస్‌ను దక్కించుకుంది. కెరీర్ చివరి టెస్టులో అర్ధశతకం, శతకం సాధించిన ఆ జట్టు ఓపెనర్ అలిస్టర్ కుక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. విరాట్ కోహ్లి, స్యామ్ కరన్‌లకు సంయుక్తంగా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం లభించింది.