తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న శాసనసభ ఎన్నికలకు సంబందించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభ ఈ నెల 6న రద్దు కావడంతో ఎన్నికలు జరపాల్సి వస్తోంది. 2018 నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం వెల్లడిస్తారు.2018, జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి…నోటీసులు జారీ చేస్తారు.
అక్టోబర్ 4 వరకు అభ్యంతరాలను పరిష్కరిస్తారు. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు. 2018 జనవరి ఒకటవ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఈ జాబితాలో ఓటరుగా ఉండాలి. ఎన్నికల విధులు సందర్భంగా నేటి నుంచి ప్రతి ఒక్కరికి సెలవులను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి ఇళ్లను సందర్శించి ఓటరు జాబితా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేరు అందులో లేదని గమనిస్తే, నిర్ణీత ఫారంలో వివరాలు నింపి సంబంధిత అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ‘మీ సేవ’లో కూడా ఓటర్లు పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయం వెబ్సైట్లో ఓటర్ల సవరణకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) తాజాగా చేసిన మీడియా ప్రకటన ప్రకారం సోమవారం సమగ్ర ఓటర్ల జాబితాను వెల్లడిస్తారు. ఓటర్ల జాబితా సవరణపై సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. నియోజకవర్గ స్థాయిల్లోనూ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.