ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఆరోపణలు, విమర్శలు చేసుకున్న వైరీ పక్షాలు ఏకమవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న సామెత నిజం అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి పోటీగానే టీడీపీ స్థాపించామన్నారు. ఎన్టీఆర్ ఉన్నపుడు ఏనాడూ కాంగ్రెస్ విధానాలను మెచ్చుకోలేదు.
ఉప్పు నిప్పులానే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉండేవి, అలాంటి పార్టీని చంద్రబాబు కాంగ్రెస్ కు దాసోహం చేసారు. తాజాగా ఆరెండు పార్టీలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయ్. దాదాపు 35 ఏళ్ల పాటు కత్తులు నూరుకున్ను పార్టీలు తొలిసారి కలిసి పోటీ చేయబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితిని ఓడించడమే లక్ష్యంగా తమ సిద్ధాంతాలను పక్కన పెట్టడం చూసి అందరూ నివ్వెరపోతున్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదంతో…కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
1983 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తో తలపడింది టీడీపీ.. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలుగుదేశం భూస్థాపితం అయ్యింది. అటు రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం కేసీఆర్ ప్రభంజనం ముందు నిలవలేకపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తులకు సిద్ధమవుతున్నాయి. అయితే తనకుతానే అనుభవఙ్జుడను, నిప్పును అని, మంచివాడిని, నిజాయితీ పరుడినని చెప్పుకునే చంద్రబాబు ఏ దురుద్దేశంతో కాంగ్రెస్ తో కలుస్తున్నారో అన్నగారి సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నారో చెప్పాలని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.