తెలంగాణలో ఎన్నికలకు కారు జోరందుకుంది. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. 105 స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్.. మరో సంచలనానికి తెరతీశారు. వీరిలో 103 మంది సిట్టింగ్‌లకే ఇవ్వగా.. చెన్నూర్, ఆంథోల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ స్థానాలను వరసగా బాల్క సుమన్, క్రాంతి కిరణ్‌కు కేటాయించారు. అతి త్వరలో మిగతా స్థానాలపై స్పష్టత ఇవ్వనున్నారు. ఇదే ఊపులో ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. అంతేకాదు రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, అందులో ఎలాంటి సందేహం లేదని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. తాను ఏం చేసినా తెలంగాణ శ్రేయస్సు కోసమే చేస్తానని,చెడు కోరి ఏదీ చేయనని పేర్కొన్నారు. ఇక పోతే శుక్రవారం (సెప్టెంబర్ 7) సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ‘ప్రజల ఆశీర్వాద సభ’తో కేసీఆర్ ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. దీనికోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. సిద్ధిపేట సమీపంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన అక్కడ నుంచి బహిరంగ సభకు వెళ్లనున్నారు. అక్టోబర్ మొదటివారంలో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయి.
