తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీను రద్దు చేస్తూ నిన్న గురువారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని అందజేశారు. ఈ క్రమంలో గవర్నర్ ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ .. కేసీఆర్ ను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ గెజిట్ విడుదల చేశారు. అయితే పూర్తి కాలం ప్రభుత్వాన్ని నడపకుండా మధ్యలో ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి గల కారణాలను కేసీఆర్ వివరిస్తూ ఎన్నో పోరాటాలు,మరెన్నో ఉద్యమాల తర్వాత ఆత్మహత్యలు, కరువుకాటకాల మధ్య ఆవిర్భవించిన తెలంగాణ రాష్ర్టాన్ని అనతికాలంలోనే ప్రగతిబాటన పయనింపజేశామని చెప్పారు.
ప్రస్తుతం అభివృద్ధిలో తెలంగాణ మంచి వృద్ధిరేటును సాధిస్తున్నదని, దీనిని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్షాలు విచ్చలవిడి ఆరోపణలు చేస్తున్నాయి.ఇలాంటి ఆరోపణలతో తెలంగాణ అభివృద్ధి ఆగుతుందని, అవి అధికారులను ఇబ్బందుల్లో పడేస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రగతిచక్రం ఆగొద్దనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. మాట్లాడితే ఎన్నికలకు పోదాం అంటూ సవాళ్ళు విసురుతున్నారు.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తెల్చుకుందామని ఈ నిర్ణయం తీసుకున్నామని పలు కారణాలు వివరించారు..