వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణపై దాడిచేసి గాయపరిచిన మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్న అనంతపురం పోలీసులకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. శ్రీరామ్‌పై కేసు నమోదుచేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు అనంత పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాప్తాడులో వైసీపీ కార్యక్రమాలను నారాయణ అనే కార్యకర్త చురుగ్గా నిర్వహిస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యర్రప్ప, మాదాపురం శంకర్, కె.పరందామ యాదవ్ తదితరులు అతనిపై దాడికి దిగారు. నారాయణ ఇంటికి వెళ్లి అతనిపై మారణాయుధాలతో దాడి చేసి అతన్ని జీపులో వేసుకుని వెంకటాపురానికి తీసుకెళ్లారు. అక్కడ పరిటాల శ్రీరాం తదితరులు నారాయణను తీవ్రంగా క్రూరత్వంతో కొట్టడంతో అతని భుజం ఎముకలు విరిగాయి. అక్కడి నుంచి రామగిరి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నారాయణ నుంచి బలవంతరంగా తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. అనంతరం ధర్మవరం పోలీస్‌స్టేషన్‌కు, ఆ తరువాత కర్ణాటకలోని తూముకూర్‌కు తీసుకెళ్లి తరువాత తెచ్చి గ్రామంలో విడిచిపెట్టారు. వైసీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి మరికొందరిపై రామగిరి పోలీస్ స్టేషన్లో దాడి, కిడ్నాప్ కేసు నమోదు అయింది. వాస్తవానికి నారాయణ నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్న పరిటాల శ్రీరాం తదితరులే వైసీపీ నేతలపై నారాయణ పేరుతో ఫిర్యాదుఇచ్చారు.
ఇది తెలుసుకున్న నారాయణ రామగిరి పోలీసుల చర్యలను తప్పుబడుతూ పరిటాల శ్రీరాం తదితరులు వ్యవహరించిన తీరును వివరించారు. తాను ఎటువంటి ఫిర్యాదు చేయలేదని చెప్పినా పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై దాడి చేశారని పరిటాల శ్రీరాం, ఇతర టీడీపీ నేతలపై నారాయణ లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదును పోలీసులు నిరాకరించారు. దీంతో నారాయణ పోస్టు ద్వారా తన ఫిర్యాదును జిల్లా ఎస్పీకి పంపారు. అయినా శ్రీరాంపై కేసు నమోదుచేయలేదు. దీంతో నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదుదారు నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరాం తదితరులపై కేసు నమోదు చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని అనంతపురం పోలీసులను ఆదేశించారు. దీంతో అనంతపురం పోలీసులు పరిటాల శ్రీరాంను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.