ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సచివాలయానికి బీజేపీ ప్రజా ప్రతినిధులు గొడుగులు పట్టుకొని, రెయిన్‌కోట్లు ధరించి వచ్చారు. వర్షాలకు సచివాలయంలో నీరు లీకవుతుండటంపట్ల ఇలా నిరసన తెలిపారు. వేయికోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయిందని ఆరోపించారు. వర్షాకాల సమావేశాలు కాబట్టి, ముందు జాగ్రత్తచర్యగా గొడుగులు, రెయిన్ కోట్లతో అసెంబ్లీకి వచ్చామని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు 10వేలతో తాత్కాలిక అసెంబ్లి నిర్మాణం ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారని మండిపడ్డారు. ఈనెల 19 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఏడు పని దినాల పాటు సభను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈ నెల 6, 7, 10, 11, 17, 18, 19 తేదీల్లో సభ జరగనుంది.