మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత అన్నదమ్ములను కూడా మోసం చేశాడని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. స్వార్ద రాజకీయాలకోసం ఆది నారాయణరెడ్డి పార్టీ మారారని ఆయన అన్నారు. తోడు–నీడగా వెన్నంటే నిలిచిన అన్నదమ్ములను మోసం చేశారని, వియ్యంకుడు కేశవరెడ్డి ఆస్తులు కాపాడుకునేందుకు వక్రబుద్ధి చూపారని ఆయన అన్నారు. అంతేకాదు నీచమనస్తత్వం కల్గిన మంత్రికి తమ నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆది నారాయణరెడ్డి భాష అద్వాన్నంగా ఉందని,నీచంగా ఉందని ఆయన అన్నారు.
3 సార్లు మంత్రి సోదరుడు నారాయణరెడ్డి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే, ఆయనను పక్కకు నెట్టి నాలుగోసారి గెలిచే సమయంలో ఆది పోటీ చేశారన్నారు. మంత్రి ఆది అంతటి స్వార్థపరుడు లేడని ధ్వజమెత్తారు. జగన్ ఇచ్చిన బీఫాంతో గెలిచి ఆయన వెంట నడవడం తన దరిద్రమా అని నిలదీశారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచి రూ.30కోట్లకో, రూ.40కోట్లకో అమ్ముడు పోకుండా ఆయన వెంట నడవడం దరిద్రమా అని చెప్పారు. తల్లిపాలు తాగి కామంతో చూసే నీ చూపు ఉన్నతమా అని అడిగారు. వైసీపీ పార్టీ ఇచ్చిన బీఫాంపై 12వేల ఓట్ల మెజారిటీతో జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే వారిని వంచించి పార్టీ మారడం దారుణమన్నారు. పదవీ వ్యామోహంతో వైసీపీ పార్టీని వదలి చంద్రబాబు మోచేతి గంజినీళ్లు తాగడం ఉన్నతమా అని అన్నారు. అధికార దాహంతో కృతజ్ఞతాహీనుడిగా మిగలావన్నారు. మంత్రి వియ్యంకుడు కేశవరెడ్డి దేశమంతా కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎగరగొడితే కుటుంబ స్వార్థం కోసం ప్రజలను గాలికొదిలేసి జగన్‌ను విమర్శించడం సరికాదని అన్నారు.