ఏపీలో ప్రతిపక్షపార్టీ వైసీపీలోకి వలసలు పర్వం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. అంతకుముందు శృంగవరపు కోట నుంచి ఐదు వందల బైకులతో ర్యాలీగా వీరంతా పెందుర్తికి తరలివచ్చారు. విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు, కళా ఆస్పత్రి అధినేత పైడి వెంకట రమణమూర్తి, పలువురు వైశ్యులు కూడా ఈ రోజు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రఘురాజు మీడియాతో మాట్లడూతు వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టిస్తారని అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు వైసీపీ కైవశం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సైనికుల్లా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రాజన్న ఆశయ సాధన కోసం జగన్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, ఆయన కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ వల్లే సాధ్యమన్నారు. బేషరతుగా వైసీపీలో చేరినట్టు తెలిపారు. ఎస్ కోట నియోజకవర్గాన్ని గెలిచి జగన్‌కు కానుకగా ఇస్తామన్నారు.
