ఏపీలో పరపాలనపై ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓ వారంరోజులు మందు తాగేవాళ్లంతా స్ట్రైక్ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం అల్లాడిపోతుందన్నారు.కేవలం రూ .8.50కి తయారయ్యే మద్యంను రూ. 50కి అమ్ముతున్నారని, దీంట్లో 37 రూపాయలు ప్రభుత్వం దోచేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై చాలా మంది తనని సంప్రదిస్తున్నారని, ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామంటున్నారని పేర్కొన్నారు . అమరావతి బాండ్లు, వడ్డీరేట్లపై చర్చ జరుగుతోందని, ట్యాక్స్ ఎంతో తెలియకుండా బాండ్లు ఎలా జారీ చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. కండిషన్ల మధ్య రాష్ట్రప్రభుత్వం అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు. అన్నిటిపై దేశంలో ఎక్కడాలేని వడ్డీలు ప్రభుత్వం వసూలు చేస్తోందన్నారు.
జలయజ్ఞంలో ఇచ్చిన కేటాయింపులు ఏంటని ప్రశ్నించారు కేవలం నాలుగేళ్లలో లక్షా 30వేలకోట్లు అప్పు చేశారని, ఇంత అప్పు చేసి దేనికి ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు . సీఎం చంద్రబాబు నిజం చెప్పి పరిపాలన చేయగలరా అని ప్రశ్నించారు. బాబు చెప్పిన వ్యాపార లెక్కలను స్విట్జర్లాండ్ ఆర్థికవేత్త వ్యతిరేకించారని, ఆయన లెక్కలు చెబితే జైళ్లో పెడతారని చెప్పినట్లు ఉండవల్లి పేర్కొన్నారు. వారానికోసారి ఖర్చు పెట్టిన లెక్కలు ప్రజలకు చెప్పగలరా అని, కనీసం ఈ 9 నెలలకు అయిన ఖర్చు చెప్పగలరా అని ప్రశ్నించారు. అవినీతి చేసి డబ్బులివ్వాల్సి వస్తోందని బాబు చెప్పారని, నంద్యాల ఎన్నికల్లో ఒప్పుకున్నారని ఉండవల్లి గుర్తు చేశారు. మొత్తమ్మీద మంచి సమయం చూసి ఉండవల్లి ప్రశ్నలు సంధించడంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.