విజయనగరంలో అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా కొత్తవలస గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల విద్యార్థినులు జ్వరాలబారిన పడ్డారు. సుమారు 20 మందికి పైగా విద్యార్థినులు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. విద్యార్థినులకు మామిడిపల్లి పీహెచ్సీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరి విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం సాలూరు పీహెచ్‌సీకి తరలించారు. అలాగే చినవంతరం కూడా జ్వరాలతో వణుకుతోంది. గ్రామంలో సుమారు 50 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితుడు ఉన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సుమారు ఇరవై రోజులుగా గ్రామస్తులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో పైసా, పరకో ఇచ్చి ఆర్ఎంపీ వైద్యుడిచే ఇంటి వద్దే వైద్యం చేయించుకుంటున్నారు. విషయం వైద్యాధికారులకు తెలిసినప్పటికీ గ్రామాన్ని సందర్శించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం లేకపోవడంతో ఉన్న ఒక్క బోరు నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. నీటి కలుషితం వల్లే జ్వరాలు ప్రబలి ఉండవచ్చని, ఏఎన్ఎం గ్రామానికి వచ్చినప్పుడు మాత్రలు ఇచ్చి వెళ్లిపోయిందని, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత వైద్యాధికారులు స్పందించి జ్వరాలు అదుపులోకి వచ్చేంతవరకు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే ఎన్నిరోజులు గడిచినా జ్వర మరణాలు ఆగడంలేదు. ఇప్పటికే ఆండ్ర గ్రామానికి చెందిన కునుకు అప్పలనాయుడు, పిట్టాడ గ్రామానికి చెందిన ఎరగడ సంధ్య, పోరాం గ్రామానికి చెందిన ఎ. వెంకటమణి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మెంటాడ గ్రామానికి చెందిన లగుడు నీలిమ(7) అనే విద్యార్థిని జ్వరంబారిన పడి ఆదివారం మృతి చెందింది. వారం రోజుల కిందట నీలిమకు జ్వరం రావడంతో స్థానికంగా చికిత్స అందించారు. మూడు రోజుల కిందట విశాఖపట్నం పెద గంట్యాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి డెంగీ లక్షణాలున్నాయని చెప్పి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. చిన్నారితండ్రి స్టీల్‌ప్లాంట్ క్యాంటిన్లో పనిచేస్తుండడంతో ఈఎస్ఐ సదుపాయం ఉంది. దీంతో నీలిమను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రులు దేవి, సురేష్‌లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇలా మన్యంలో ఎక్కడచూసినా ఆరోగ్యంకోసం ఎదురు చూపులు, జ్వరంతో చనిపోయినవారి కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. తాజాగా ఈ ఘటనపైనే విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే సాయన్నదొరలు ప్రభుత్వాన్ని నిలదీసినా కనీస చలనం లేదు.
