అప్రజాస్వామ్య పద్ధతిలో వైసిపి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి కండువాలు కప్పిన ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీని గతంలో బహిష్కరించారు. పార్టీ మార్చిన ఎమ్మెల్యేలకు డిస్క్వాలిఫై చేసేవరకు అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదని వైసీపీ తేల్చి చెప్పింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా వైసిపి ఎమ్మెలేలు లేకుండానే కొనసాగనున్నాయి. ఈసమావేశాలకైనా వైసిపి ఎమ్మెల్యేలు వస్తారన్న పుకార్లకు బ్రేక్ పడినట్లయింది. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మళ్లీ అదే వాయిస్ వినిపించారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ రాసింది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని లేఖలో డిమాండు చేశారు. కోట్ల రూపాయాలతో మా పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసిందని, వారిపై వేటు వేయాలని ఎన్నిసార్లు లేఖలు ఇచ్చినా స్పీకర్ స్పందించలేదని అందులో పేర్కొన్నారు. రేపట్నుంచి జరగబోయే అసెంబ్లీకి హాజరు కావాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు… మేము స్పీకరుకి బహిరంగ లేఖ రాస్తున్నాం.. ఇప్పటికైనా వారిని అనర్హులుగా ప్రకటించండి, రేపు సమావేశాలకు వస్తాం.. స్పీకర్ స్థానాన్ని మీరు అవమానపరుస్తున్నారు. మీకు అంతగా అభిమానముంటే స్పీకర్ సీట్ నుంచి దిగిపోయి చంద్రబాబు కి పాలాభిషేకం చేసుకోవాలి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. మేము అసెంబ్లీకి వెళ్లిన ప్రతిసారి జగన్, మమ్ముల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. తమ పోరాటం ఆగదని చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాలు ఎండగడుతూనే ఉంటామన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నీకు, స్పీకరుకి బుద్ధి, జ్ఞానం, సిగ్గూ శరం ఉంటే జంపింగ్ ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని, కోడెల స్పీకర్ కుర్చికే కళంకం తెచ్చాడన్నారు. సీఎం ఫోటోకి పాలాభిషేకం చేసేంత హీనస్థితికి కోడెల దిగజారాడన్నారు.