అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సీనియర్ నేత ఎస్.శ్రీరాములు (66) మంగళవారం బెంగుళూరు ఆస్పత్రిలో కన్నుమూశారు. రాప్తాడు గ్రామ పంచాయతీకి చెందిన ఎస్.శ్రీరాములు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు అనంతపురంలోనూ, బెంగళూరులోనూ వైద్యం చేయించారు. మంగళవారం ఉదయం బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీరాములు మృతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, పార్టీ కార్యకర్తలతో పాటు రాప్తాడుకు చేరుకొని శ్రీరాములు భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీరాములు వైసీపీలో చురుకైన వ్యక్తియని, వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని శ్రీరాములు కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. గోపాల్ రెడ్డితో పాటు మండల కన్వీనర్ బోయ రామాంజనేయులు, నాయకులు నాగరాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
