టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు దళితులు, సామాన్య ప్రజలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.తాజాగా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలో అధికారపార్టీ ఎంపీటీసీ సభ్యుడు వల్లభ వసంతరావు, గొనప అప్పిలితో పాటు మరికొంతమంది గ్రామానికి చెందిన దళిత మహిళ యజ్జల పద్మపై విచక్షణ రహిత దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలై ఆమె టెక్కలి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు వెనుకంజ వేస్తున్నారంటూ దళిత సంఘానికి చెందిన పలువురు చెబుతున్నారు.
బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం… టెక్కలి నియోజకవర్గం బోరుభద్ర గ్రామంలో తనకు కొంత భూమి ఉందని అది వల్లభ వసంతరావు ఆక్రమించుకునే ప్రయత్నాలు చేయడంతో ఇటీవల ఆర్డీవోకు ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. దీంతో కక్ష కట్టిన వసంతరావు తన అనుచరులతో కలిసి ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తన ఇంట్లోకి వచ్చి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారని చెప్పింది. మెడ పట్టుకుని గోళ్లుతో రక్కి కొట్టడంతో వారి కాళ్లపై పడి తనను ఏం చేయవద్దంటూ బతిమలాడినా కనీసం మానవత్వ లేకుండా దాడి చేశారని ఆరోపించింది.దాడి విషయం తెలుసుకున్న కేఎన్‌పీఎస్ దళిత సంఘం ప్రతినిధులు బి.ప్రభాకరరావు, వై.గోపి, బి.మోహనరావు తదితరులు ఆస్పత్రి వద్దకు సోమవారం చేరుకుని బాధితురాలిని ఓదార్చారు. సమాచారం తెలుసుకున్న సంతబొమ్మాళి ఏఎస్‌ఐ ఎన్.కృష్ణతో పాటు సిబ్బంది టెక్కలి ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. అధికారంలో ఉండడంతో ఎంపీటీసీ ఇంతటి దారుణం చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయారు.