కేసీయార్ ఉపన్యాసం అనగానే అది ఒక నయాగరా జలపాతం. ప్రత్యర్థులపై బోలెడన్ని విసుర్లు, చెణుకులతో చెడుగుడు ఆడుకుంటారు అని కేసీయార్ అభిమానులే కాక సామాన్యులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆశువుగా ఆయన నోట జాలువారే జోకులు, సామెతలు, ఉపమానాలు కట్టిపడేస్తాయి.
కానీ, మొన్నటి సభలో చాలామందికి అవి కనిపించలేదు. కేసీయార్ మార్కు చెమక్కులు వినిపించలేదు. మాట్లాడింది కేసీయారేనా అని చాలామంది ఆశ్చర్యపోయారు. మొన్నటి కేసీయార్ ప్రసంగాన్ని లోతుగా విశ్లేషించాలి. అప్పుడుగానీ, కేసీయార్ నుంచి ప్రజలు ఏమి ఆశించారో, దాన్ని కేసీయార్ ఎలా వివరించారో అర్ధం కాదు.
మొన్నటి సభకు తెలంగాణ రాష్ట్రసమితి వారు ఏమని నామకరణమ్ చేశారు? “ప్రగతి నివేదన సభ” అని. అవునా కాదా? నివేదన అన్న పదం లోనే కేసీయార్ మనోగతం ఏమిటో తెలుస్తుంది. గత నాలుగున్నర ఏళ్లలో తమ ప్రభుత్వం ఏమి సాధించిందో ప్రజలకు వివరించడమే ఈ సభ ప్రధానోద్దేశ్యం. కాకపొతే ఈ సభలో తన శైలికి విరుద్ధంగా పామరభాషలో కాకుండా పండితభాషలో ప్రసంగించారు. అందుకే చాలామంది నిరాశపడ్డారు. కానీ, అసలు విషయం తెలుసుకుంటే కేసీయార్ పాటించిన సంయమనం వెనుక ఎంతటి కథ ఉందొ విదితం కాదు. ప్రత్యర్థులను తిడితేనే అది గొప్ప ఉపన్యాసం కాదు.
కేసీయార్ ఉపన్యాసంలో ప్రధానంగా రెండు రాష్ట్రాల ప్రజలు ఊహించుకున్నది ముందస్తు ఎన్నికల ప్రకటన. నిజానికి ముందస్తు ఎన్నికల ప్రకటన తీర్మానాన్ని ఆమోదించాల్సింది రాష్ట్ర మంత్రివర్గం. ఆ తరువాత ఆ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించి కేంద్రానికి పంపించాలి. అంతే తప్ప ముఖ్యమంత్రి హోదాలో ప్రజాసభలో ఎన్నికల ప్రకటన చేస్తారని ఎలా ఊహించుకున్నారు?
ఇక్కడ కేసీయార్ అత్యంత తెలివిగా వ్యవహరించారు. ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా కేసీయార్ నుంచి అసెంబ్లీ రద్దు ప్రకటన వస్తుందని ఊహించి పప్పులో కాలేసింది. ముందస్తు ఎన్నికలు దేనికి? అని ప్రశ్నను లేపడంతోనే కాంగ్రెస్ లో భయాన్ని రగిలించారు కేసీయార్. మళ్ళీ ఎప్పుడు, ఏ క్షణాన ఎన్నికల ప్రకటన వస్తుందో అని కాంగ్రెస్ నిద్రలేని రాత్రులు గడపాలి ఇకమీద. ఇది కేసీయార్ సాధించిన తొలివిజయం.
ఇక కేసీయార్ ఈ సభలో అనేక సందేశాలను ప్రజలకు విజయవంతంగా అందించారు. తొలుతగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రస్తావించారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ తానొక లేఖను అప్పటి ముఖ్యమంత్రికి రాసానని, కానీ ఆ తరువాత అది కాల్పులవరకూ వెళ్లిపోయిందని చెప్పడం ద్వారా తనకు ఉద్యమస్ఫూర్తి కలిగిందని చెప్పి తాను రైతులపక్షం అని చెప్పకనే చెప్పారు. ఇక ఆ తరువాత అదేదో గ్రామంలో పెళ్ళిఖర్చు తట్టుకోలేని ఒక రైతు కుటుంబానికి లక్షరూపాయల ఆర్థికసాయం అందించినపుడు “కల్యాణలక్ష్మి” పధకం తన మదిలో మెరిసిందని చెప్పి ఆడపడుచుల మనసు చూరగొన్నారు. పూడిపోయిన చెరువులు, ఖాళీగా ఉన్న కాలువలను, చూసి మిషన్ కాకతీయ పధకం, అనేక జిల్లాల్లో తాగునీటికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసాక మిషన్ భగీరథ పధకం ఉద్భవించిందని చెప్పి తాను ప్రజల సమస్యలను పట్టించుకునే ముఖ్యమంత్రిని అని చాటుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక మీద వచ్చే ఆదాయం కేవలం తొమ్మిది కోట్లుగా ఉండగా, నేడు అది 1900 కోట్ల రూపాయలకు చేరింది అని చెప్పడం ద్వారా ఇసుక దోపిడీని అరికట్టామని చెప్పారు.
భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సుమారు 450 పధకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయని చెప్పడం ద్వారా సంక్షేమపథకాలకు తాము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చెప్పకనే చెప్పారు. మొన్ననే ప్రధానిని ఒప్పించి జోనల్ వ్యవస్థను ఆమోదింపజేయడం ద్వారా తొంభై అయిదు శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి అని చెప్పి నిరుద్యోగుల మనసు చూరగొన్నారు.నిరంతర విద్యుత్ అందించడమే కాక, రైతుబంధు పధకం ద్వారా రైతాంగానికి ఎనలేని మేలు చేస్తున్నామని చెప్పి కర్షకుల హర్షాన్ని పొందారు. అలాగే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని నొక్కి వక్కాణించారు.
ఇక తెలంగాణ ఆవిర్భావానికి ముందు, తరువాతా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో మేధోమధనం జరిగిందని, ఆ సుదీర్ఘ చర్చా ఫలాలు నేడు ప్రభుత్వ పథకాలుగా మారి ప్రజల ఆకాంక్షలను ఈడేరుస్తున్నాయని విన్నవించారు. తాను ఒక్కడిగా ప్రారంభించిన ఉద్యమం ఆ తరువాత ప్రజల సహకారంతో మహోద్యమంగా మారి రాష్ట్రాన్ని సాధించేంతవరకూ కొనసాగిందని గుర్తు చేశారు.
ఇక ముందస్తు ఎన్నికల విషయం చాలా స్పష్టంగా చెప్పారు కేసీయార్. పార్టీ సీనియర్ నాయకుడు కేశవరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రణాళిక కమిటీని నియమించామని, మేనిఫెస్టో ను ఆ కమిటీ తయారు చేస్తుందని చెప్పడంలో అంతరార్ధం అర్ధం కావడంలేదా? గత నాలుగేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశామని, ఇకముందు కూడా చేసే అవకాశం ఇవ్వాలని కోరడంలో ముందస్తు ఎన్నికల ప్రకటన లేదా? ఎన్నికల విషయం మీద తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తనకు అధికారాన్ని దఖలు పరచిందని చెప్పడం ముందస్తు ఎన్నికల సూచన కాదా? అలాగే మరో కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఆర్ధికమంత్రి ప్రకటించడం అంటే అది ఎన్నికల ప్రకటన కోసమే అని తెలియడం లేదా? మనకు మంచిరోజులు ఇంకా ముందు కూడా ఉన్నాయని చెప్పడంలో ఎన్నికల వాతావరణం కనిపించడం లేదా? ముఖ్యమంత్రి హోదాలో సభలో ప్రకటన చెయ్యడం భావ్యం కాదని చెప్పారంటే అంతకంటే సూటిగా ఇంకేమి చెప్పాలి?
ఢిల్లీకి బానిసత్వం వద్దని చెబుతూ పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపించారు కేసీయార్. గత యాభై ఏళ్లుగా తమిళనాడులో ప్రాంతీయపార్టీలదే రాజ్యంగా ఉన్నదని, అందుకనే దేశరాజకీయాల్లో వారికి గౌరవం దక్కుతున్నదని చెప్పడం ద్వారా జాతీయపార్టీలకు ఓట్లు వెయ్యకుండా, మన ఆత్మగౌరవాన్ని నిలిపే మనపార్టీకే ఓటు వెయ్యమని ఎంత క్లియర్ గా చెప్పారు కేసీయార్!
ఈ సభకు సుమారు పాతిక లక్షల పైచిలుకు హాజరయ్యారని తెలుస్తున్నది. కేసీయార్ ఉపన్యాసానికి అడుగడుగునా హర్షధ్వానాలు మార్మోగాయి.
అల్పుడెపుడు పల్కు ఆడంబరము గాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమా!
అయ్యా.. అదీ సంగతి.
(ముఖ్యమంత్రి గారి ముఖ్య ప్రజాసంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు నేటి “ది హాన్స్ ఇండియా” పత్రికలో వ్రాసిన వ్యాసానికి నా బాణీలో భాష్యం)
Source:(పెద్దలు శ్రీ వనం జ్వాలా నరసింహారావు, సీనియర్ పాత్రికేయులు శ్రీ భండారు శ్రీనివాస రావు లతో కలిసి….
ఇలాపావులూరి మురళీమోహన్ రావు గారి వాల్ నుండి సేకరణ @@@)