తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన కొంగరకలాన్ సభ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో మహాజనప్రభంజనాన్ని సృష్టించి టీఆర్‌ఎస్ పార్టీ చరిత్రను తిరగరాసింది. వరంగల్‌లో 2010 డిసెంబర్ 16న నిర్వహించిన మహాగర్జన సభ ఇప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద రాజకీయసభగా రికార్డుకెక్కగా.. 25 లక్షల మందితో ప్రగతి నివేదనసభను నిర్వహించి టీఆర్‌ఎస్ తన రికార్డును తానే తిరగరాసింది. దాదాపు రెండువేల ఎకరాలకు పైగా విశాల ప్రాంగణంలో ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభ మహాసంద్రాన్ని తలపించింది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన లక్షల మంది జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అంచనాలకు మించిన జనంతో ప్రగతి నివేదన సభ మహాప్రభంజనంగా మారింది. పల్లెల నుంచి పిల్ల కాల్వల్లా కదిలిన జనం.. మండలాల్లో పెద్ద కాల్వల్లా.. పట్టణాల్లో నదిగా మారి.. కొంగరకలాన్‌లో కడలిలాగ ఉప్పొంగారు. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశలోనే కాదు.. దేశంలోనే ఇప్పటివరకు ఇంత జనంతో సభలు జరిగిన దాఖలాలు లేవు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నేతృత్వంలో 1994లో సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో టీడీపీ నిర్వహించిన సింహగర్జన సభకు లక్ష మంది జనం హాజరయ్యారు. అప్పట్లో అదే రికార్డు. కానీ, ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ అంతకంటే భారీసభలను పలుమార్లు నిర్వహించింది. 2001లో కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ, 2003లో వరంగల్‌లో జైత్రయాత్ర సభ, 2015 ఏప్రిల్ 27న పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలు జనప్రభంజనాన్ని సృష్టించాయి.
