రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు కేసీఆర్ వివరించారు. వచ్చే ఎలక్షన్లలోపు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ఇచ్చి, నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడుగ.. ఎలక్షన్లకు రాను అని చెప్పిన. ఈ మాటలు చెప్పాలంటే ఖలేజా ఉండాలే. దేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ అధ్యక్షుడు.. ఏ సీఎం చెప్పలే. కానీ, కేసీఆర్ చెప్పినాడు. నేనీరోజు గర్వంగా ప్రకటిస్తా ఉన్న. ఈ రోజు సాయంత్రానికి 22 వేల గ్రామాలకు శుద్ధి చేసిన నీళ్లు అందుతున్నయి. ఇంకో 1300 గ్రామాలు మిగిలున్నయి. వాటికి రాబోయే ఏడెనిమిది రోజులల్లో నీళ్లు చేరుతయి. ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం 46% పూర్తయింది. మార్చి, ఏప్రిల్ దాకా గడువు ఉన్నా, వచ్చే దీపావళి వరకూ.. ఎన్నికలకంటే ఆర్నెల్లముందే.. మనం ఓట్లు అడిగే దానికంటే ముందే.. ఇంటింటికీ నల్లాతోని కృష్ణా, గోదావరి నీళ్లు వస్తయి. మా ఆడబిడ్డల పాదాలు ఆ నీళ్లతో కడిగి చూపిస్తం. ఇది అద్భుతమైన విజయం. 11 రాష్ట్రాల వాళ్లు వచ్చి చూసిపోయినారు. మా దగ్గర కూడా పెట్టుకుంటామని చెప్తున్నరు. నీతిఆయోగ్‌తోపాటు దేశవిదేశాలవారు మిషన్‌భగీరథను పొగుడుతున్నరు.
