మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైసీపీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైసీపీలో చేరడంతో పాదయాత్రలో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆనం రామానారాయణ రెడ్డి మాట్టడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలను టీడీపీ, బీజేపీ దారుణంగా మోసం చేశాయని దుయ్యబట్టారు. ప్రజలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆయన చేసే ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆనం రామానారాయణ రెడ్డి చేరికపై వైసీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందరం కలిసి ఏకతాటిపై నడిచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. అంతేకాదు వచ్చే ఏన్నికల్లో నెల్లూరులో అన్ని సీట్లు వైసీపీనే విజయం సాదిస్తుందని అన్నారు
