ప్రగతి నివేదన సభ ప్రాంతమంతా గులాబీ జెండలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగుతున్నాయి. ఒకరోజు ముందు నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్‌కు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొంగరకలాన్‌కు వచ్చే దారులన్నీ గులాబీమయమయ్యాయి. చీమలదండులా వాహనాల ర్యాలీగా గ్రామాలు, మండలాలు, జిల్లాల కేంద్రాల్లో గులాబీ తోరణాలు కనువిందు చేస్తున్నాయి. రహదారుల పొడవునా.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల తోరణాలుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కూడళ్ల వద్ద, రోడ్లపైనా గులాబీజెండాలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్రైవేటు వాహనాలు, బైకుల ద్వారా కొంగరకలాన్ కు ప్రజలు బాట పట్టారు.
ఇక జిల్లా కేంద్రాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వయంగా ట్రాక్టర్లు నడుపుతూ కొంగరకలాన్ కు బయల్దేరారు. మహిళలైతే కొలాటాలు, బతుకమ్మలతో సందడి చేస్తూ పయనమయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ పేరు వినగానే కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతుందని, ఆ పార్టీకి ఎన్నికలంటేనే భయం పట్టుకుందని టీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ప్రగతి నివేదన సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో చూడలేక కాంగ్రెస్ నాయకులు సభపై దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతే రాజు అన్న కాంగ్రెస్ నాయకులు.. రైతు వెన్నెముక విరిచారు. కానీ కేసీఆర్ రైతును రాజుగా చేశాడని పేర్కొన్నారు.
తెలంగాణలోని ప్రజానీకం అంతా ప్రగతి నివేదిక సభ జరుగుతున్న కొంగర్ కలాన్ కు పయనమయ్యారని మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. నాయిని మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలుస్తుందని నాయిని స్పష్టం చేశారు. బహిరంగ సభ ఏర్పాట్లను చూసి ప్రతిపక్షాల కడుపు మండుతోందని పేర్కొన్నారు. అరవై ఏళ్ళలో జరగని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం నాలుగు సంవత్సరాల్లోనే చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. బహిరంగ సభ వలన ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తప్పుడు కూతలు కూస్తున్న ప్రతిపక్షాలకు ముందుగా కంటి వెలుగు సెంటర్ లలో కంటి పరీక్షలు నిర్వహించాలని వ్యాఖ్యానించారు.