మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్‌కు గురుచేసిందని ఆపార్టీ అధ్యక్షుడు జగన్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. గుడివాడ నియోజకవర్గానికి హరికృష్ణకి ఉన్న సంబంధాన్ని ఆయన అభిమానులు గుర్తుచేసుకున్నారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. హరికృష్ణ మరణం నందమూరి అభిమానులకు తీరని లోటన్నారు. 1999లో హరికృష్ణ ‘అన్నాటీడీపీ’ స్థాపించి, గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన హరికృష్ణకు రధసారధిగా వ్యవహరించానని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతదేహం వెంటే ఉంటూ కొడాలినాని నిజమైన స్నేహితుడిగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని హాస్పిటల్ నుంచి హైదరాబాద్ లోని నివాసం వరకూ అంబులెన్స్ లోనే నాని ఉన్నారు. ఇంటికి వచ్చాక మృతదేహాన్ని తన చేతులతో దించారు కొడాలి నాని.