రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హరికృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులంతా నివాళులర్పిస్తున్నారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సినీరంగ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. చిరంజీవి, రామ్ చరణ్ తేజ, వెంకటేష్, ఎంఎం కీరవాణిలు మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అభిమానులు కూడా భారీసంఖ్యలో చివరిసారిగా చూసేందుకు వస్తున్నారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన చిరంజీవి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇదో దుర్దినం అని, ఆత్మీయమిత్రుడు, సోదర సమానుడైన హరికృష్ణ మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. హరికృష్ణ ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, కలిసిన కొద్దిసేపైనా సరదగా మాట్లాడేవారని, జోక్స్ వేస్తూ నవ్వించేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, హరికృష్ణ కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం కలిగించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.