సీటుబెల్టు పెట్టుకోకపోవడం, అత్యంత వేగంగా కారును నడపడం వల్లే రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో హరికృష్ణతో పాటు ఆయన స్నేహితులు అరికపూడి శివాజీ, వెంకట్రావులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో హరికృష్ణ చనిపోగా ఆయన స్నేహితులు శివాజీ, వెంకట్రావులు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరికపూడి శివాజీ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఉదయం నాలుగున్నర గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలు దేరామని చెప్పారు.
హరికృష్ణ తానే కారు డ్రైవింగ్ చేస్తానన్నారని వెల్లడించారు. ఆయన డ్రైవింగ్ చేస్తుండగా పక్క సీట్లో తాను కూర్చున్నట్లు తెలిపారు. కారురాయిపై ఎక్కడం వల్ల అదుపు తప్పిందని పేర్కొన్నారు. హరికృష్ణ సీటుబెల్టు పెట్టుకోకపోవడంతో ప్రమాద సమయంలో కారులోనుంచి ఎగిరి బయటకు పడ్డారని చెప్పారు. తాము సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రమాదం నుంచి బయటపడగలిగామని వెల్లడించారు. ప్రమాదం సమయంలో కారు వేగం 100 కిలోమీటర్ల వేగం ఉండవచ్చునని తెలిపారు. నల్లగొండ ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కారు అన్నెపర్తి వద్ద అదుపుతప్పి ముందు వాహనాన్ని ఢికొట్టింది. అనంతరం డివైడర్‌ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢికొట్టింది. దీంతో హరికృష్ణ కారు గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో ఆయన హరికృష్ణ దాదాపు 30అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలైన హరికృష్ణను 5నిమిషాల్లో నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రి తరలించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో హరికృష్ణ మృతి చెందారని, సీటు బెల్టు ధరించకపోవడం, అతివేగమే ప్రమాదానికి కారణం అని ఎస్పీ పేర్కొన్నారు.