అక్కచెల్లెమ్మల అనురాగంతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అంతులేని ఆత్మీయత, అభిమానంతో ప్రజాసంకల్పయాత్ర సాగింది. ఆదివారం రాఖీ పండుగరోజున విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగింది. జగన్ కు అక్కచెల్లెమ్మలు దారిపొడవునా రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. రాంబిల్లి మండలం ధారభోగాపురం మొదలు.. వెంకటాపురం, గొర్లిధర్మవరం, వెదురవాడ, అచ్యుతాపురం, రామన్నపాలెం వరకు సాగిన యాత్రలో వేలమంది అక్కచెల్లెమ్మలు జగన్ కు రాఖీలు కట్టారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ కావడంతో చేతుల్లో రాఖీలు, పూలు, పండ్లు, హారతులతో పెద్దఎత్తున మహిళలు జగన్కు స్వాగతం పలికారు. పాలకుల దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ జగన్కు రాఖీలు కట్టి నోరు తీపి చేశారు. పాదయాత్ర ముగిసే వరకు అసంఖ్యాక మహిళలు జగన్కు రాఖీలు కట్టి, ఆయనతో పాటు అడుగులో అడుగు వేశారు. పాదయాత్రలో ఆద్యంతం రాఖీ పౌర్ణమి సందడి చోటుచేసుకుంది. యలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం మండలం జగన్కు నీరాజనాలు పలికింది. చిరు జల్లులు పడుతున్నా, రోడ్లన్నీ చిత్తడిగా ఉన్నా మహిళా లోకం నీరాజనాలు పలికింది. అచ్యుతాపురంలోనూ వందలాది మహిళలు రాఖీలు కట్టేందుకు పోటీ పడ్డారు. ఈ ప్రభుత్వ హయాంలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని విన్నవించారు. స్కూళ్లు, హాస్టళ్లతో పాటు వీధివీధినా ఆకతాయిలు అల్లరి చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు పాలనలో పూటకో అత్యాచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కచెల్లెమ్మల భద్రత, రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వారికి జగన్ భరోసా ఇచ్చారు. జగన్ చేతికి నిన్న ఒక్కరోజే వేలమంది రాఖీలు కట్టారు. ముఖ్యంగా దేశచరిత్రలో మరే నాయకుడికీ ఇంతటి ప్రజాదరణ ఉండదేమో.
