రాష్ట్రంలో వలసల గాలి వీస్తోంది.. ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుసగా వైసీపీ బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద అత్యంత కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులు జగన్ చెంతకు చేరుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన సీనియర్ అధికారులు సైతం ఆయన పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా పనిచేసిన సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేసిన మాజీ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీని కాదని వైసిపిలో చేరారు. చంద్రబాబు పరిపాలనాపరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రతీ శాఖలోనూ అవినీతి వంటి అంశాలతో విసిగిన ఇక్బాల్ వైసీపీలో చేరారు. పార్టీలో మంచి స్థానం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. తనవద్ద అధికారిగా పనిచేసిన ఇక్బాల్‌ను కూడా చంద్రబాబు తన పాలనతో ఆకట్టుకోలేకపోయారని వైసీపీ నేతలు నవ్వుకుంటున్నారు. పైగా ఇప్పటికీ ఇక్బాల్ ఏపీ ప్రభుత్వంలోని ఓ యువమంత్రి వద్ద వ్యక్తిగతంగా పనిచేస్తున్నారట.
ఈక్రమంలో మాజీ డీజీపీ సాంబశివరావు జగన్ ను ప్రజాసంకల్పయాత్రలో విశాఖలో కలిసారు. సుమారు 15 నిమిషాలపాటు ఇరువురూ మాట్లాడుకున్నారు. దీంతో ఆయన వైసీపీలోకి చేరునున్నారని తెలుస్తోంది. విజయసాయిరెడ్డి కూడా ఇది శుభపరిణామం అని, సాంబశివరావు సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. గతంలో సాంబశివ రావు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా పని చేశారు. ఒంగోలులో మిరియాలపాలెంకు చెందిన సాంబశివరావు స్వయంకృషితో ఎదిగారు.
ఇలా వైసీపీపట్ల రాజకీయ పార్టీల నేతలే కాకుండా మాజీ ఉన్నతాధికారులు, మేధావులు కూడా ఆకర్శితులవుతున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి వ్యక్తులు వైసీపీ నుంచి పోటీ చేశారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వద్ద కీలక అధికారిగా పనిచేశారు.