భుజానికి తీవ్రమైన గాయం కావడంతో వారం రోజులుగా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ కే పరిమితం అయిన నూతన్ నాయుడు హౌస్ లోకి ఎంటర్ అయ్యి హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులకి కూడా షాక్ ఇచ్చాడు. షోల్డర్ జాయింట్ డిస్ లొకేషన్ తో హౌస్ లోనుండి బయటకు వెళ్ళిపోయిన నూతన్ నాయుడు మళ్ళీ రాడని చాలామంది హౌస్ మేట్స్ అనుకున్నారు. ప్రేక్షకులు కూడా చాలామంది బిగ్ బాస్ హౌస్ లో నూతన్ నాయుడు ప్రస్థానం ముగిసిపోయింది అనుకున్నారు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నూతన్ నాయుడు మళ్ళీ షోలో రంగప్రవేశం చేసాడు. దీనితో వారం రోజులనుండి నడుస్తున్న ఊహాగానాలకు తెరపడింది. రీ ఎంట్రీతో వచ్చిన అవకాశం గాయంతో దూరం అయ్యే పరిస్థితి వచ్చినా పట్టుదలతో మళ్ళీ హౌస్ లోకి వచ్చిన నూతన్ నాయుడు తనదైన ఆటతీరుతో అలరించాలని, హౌస్ లో ఒంటరి పోరాటం చేస్తున్న కౌశల్ కి ఎప్పటిలాగానే తన సపోర్ట్ అందించాలని మనంకూడా ఆశిద్దాం.
