కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని కలాసమాలపల్లిలో సొసైటీ భూముల వివాదంపై దళితుల్లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు రెండు వర్గాలుగా చీలి బుధవారం తెల్లవారుజామున కర్రలతో దాడులకు తెగబడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈక్రమంలో బాధితులను పరామర్శించేందుకు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అలాగే బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు ఆగ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మీకు న్యాయం చేస్తానంటూ కల్పన అంటుండగానే నీ న్యాయం మాకక్కర్లేదు ఇక్కడినుంచి వెళ్లిపో అంటూ మహిళలు రెండుచేతులూ జోడించి నిరసన తెలిపారు. కులంపేరుతో దూషించిన టీడీపీ నాయకుడు మురళీని వెనకేసుకొచ్చి తమను అణగతొక్కాలని చూసారని నిందించారు. ఎమ్మెల్యే కల్పనను, టీడీపీ శ్రేణులను నిలదీసి మురళిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. ఆస్పత్రి ఎదురుగా రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. దళితులకు అండగా వైఎస్సార్ సీపీ నేత అనీల్‌కుమార్ ఆందోళనలో పాల్గొన్నారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ పల్లె వాతావరణాన్ని టీడీపీ పూర్తిగా కలుషితం చేస్తోందని, కులాల మధ్య కల్పన చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బాధ్యతను విస్మరించడంతో కలాసమాలపల్లిలో మాలలు భౌతిక దాడులకు దిగారని ఆరోపించారు.