గత కొన్ని రోజులనుంచి తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ )కి వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. టీటీడీ పరిధిలో ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే సంబంధిత బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.వివరాల్లోకి వెళ్తే..శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు తనను గతకొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆ ఆలయంలో అటెండర్ గా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ అనే ఉద్యోగిని కుమార్తె ప్రభావతి ఇవాళ మీడియాకు తన భాదను వెల్లడించింది.ఈ నెల 19న తాను చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశానని..అయినా వారు పట్టించుకోవడం లేదని పేర్కొంది.‘మా అమ్మ ఎస్‌ఆర్‌లో నా పేరు చేర్చడానికి ఏఈవో నన్ను వేధిస్తున్నాడు. కోరిక తీర్చమంటున్నాడు. ఆ పనిచేయకపోతే అమ్మను వేరే రాష్ట్రానికి పంపుతానంటున్నాడు. టీటీడీ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది…’అంటూ బాధితురాలు మీడియా ముందు వాపోయింది. శ్రీనివాసులు ఫోన్లో చేసిన బెదిరింపులు, కామ కోరికల వేధింపుల కాల్స్‌ను ఆమె పోలీసులకు అందించింది.
