అధికార తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదాస్పద రీతిలో ప్రవర్తించారు. ఎమ్మెల్యే అన్న పేరే కానీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. జిల్లాలో తాను చెప్పిందే వేదంగా, తన ఏరియా కాకపోయినా ఎక్కడైనా పంచాయితీ చేస్తూ నిత్యం దూకుడు ప్రదర్శించే చింతమనేని గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడినందుకు ఆమెపై చేయిచేసుకున్నాడు. అలాగే గతంలో నూజివీడులో కేవలం బస్సు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఫొటో చిరిగిపోయిందని, ఆ బస్సులోని డ్రైవర్ కండక్టర్లపై చేయి చేసుకునేంతవరకూ వెళ్లాడు.. అలాగే అతనికి సంబంధం లేకపోయినా ఏలూరు వెళ్లిమరీ అక్కడి పోలీసులను, అధికారులను బెదిరిస్తూ ఉంటారు. కొల్లేటి లంక గ్రామాల్లోనూ చింతమనేని దందాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అతను మాట్లాడుతున్న మైకు సరిగా పని చేయలేదనే ఒకే ఒక్క కారణంతో సొంత పార్టీ నేతలనే నానా దుర్భాషలాడాడు. కనీసం రాయలేని పదజాలంతో నీచమైన భాష మాట్లాడి మరోసారి తన మూర్ఖత్వపు మనస్తత్వాన్ని బయటపెట్టారంటూ చింతమనేని తిట్టుకుంటున్నారు.
