జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. గతంలో టీడీపీ అండతో వైసీపీపై విపరీతమైన ఆరోపణలు చేసినా వైసీపీ అంతగా పట్టించుకోలేదు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేదు.. అనంతరం విబేధాలతో పవన్ టీడీపికి దూరమయ్యారు. అయితే అప్పటినుంచీ పవన్ ను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు తెలుగుదేశం నేతలు.. గతంలో అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనెవరో నాకు ఐడియా లేదు. అందరూ అంటున్నారు ఎవరో సినిమావాడట.. నేను సినిమాలు చూసి చాలా ఏళ్లైంది. సినిమాల గురించి మాట్లాడితే నేనేం చెప్పను అని వ్యాఖ్యానించారు. పవన్ చేసిన ట్వీట్‌పై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు.
అలాగో మరో ప్రెస్ మీట్ లోనూ పవన్ టీడీపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపైనా, మీడియాను నిషేధించమని పిలుపునివ్వడంపైనా టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుంది.. అలాంటిది, కొన్ని ఛానళ్లను చూడవద్దని పవన్ కల్యాణ్ ఎలా చెబుతారని ఖాన్ మండిపడ్డారు. మీకు అనుకూలంగా వార్తలను ప్రసారం చేసిన ఛానళ్లను చూడాలా? మీకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తే చూడకూడదా? ఇదెక్కడి విడ్డూరం అని నిలదీశారు. పవన్ తీరు మార్చుకోవాలని, మీఅన్న చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చి కాపులను ముంచేశారని, ఇప్పుడు వారిని మరోసారి ముంచేందుకు నువ్వొచ్చావా అని ఎద్దేవా చేశారు.
అలాగే తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని పవన్ ను అసలు లెక్కలోకి తీసుకోకుండా మాట్లాడారు. పవన్ కంటే చిరంజీవికి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువని చెప్పారు. వచ్చేఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క సీటు రాదన్నారు. పవన్ కు స్థిరత్వం, పరిణితి లేవని చెప్పారు. పీఆర్పీని చాలా దగ్గరగా పరిశీలించిన వ్యక్తిగా తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఇప్పటి పవన్ కళ్యాణ్ కంటే ఆరోజు చిరంజీవి వంద రెట్లు బలవంతుడన్నారు. చిరంజీవి వ్యక్తిత్వం కూడా చాలా సున్నితమైనది అని చెప్పారు. ఆయన చాలా మృధు స్వభావి అని, ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి అని, అలాంటి చిరంజీవికే 18 సీట్లు వచ్చాయని కేశినేని అన్నారు. తన సొంత స్థానంలోనే చిరంజీవి ఓడిపోయారన్నారు. పవన్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఆయన కూడా ఓడిపోతారని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికలు టీడీపీకి చావుబతుకుల సమస్య అని, అప్పట్లో ఒక్క ఓటును కూడా తాము వదులుకునే పరిస్థితి లేదన్నారు. అందుకే తమతో వచ్చే అందరినీ కలుపుకుని వెళ్లామని పవన్ గురించి క్లారిటీ ఇచ్చారు.
అలాగే టీడీపీలో అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సంచలన కామెంట్లు చేశారు. 2014 ఎన్నికలలో పవన్ టిడిపితో కలగకముందే తన నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో టీడీపీకి అధికశాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో మెయిన్ ఎలక్షన్లలో పవన్ కలవడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఒరిగిందేమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి మొదటి ముద్దాయి చిరంజీవే అని ఆరోపించారు. ‘మీ అన్న చిరంజీవి ఇంత ద్రోహం చేస్తే ఎందుకు అడగలేక పోతున్నావు’ అని పవన్‌ను చింతమనేని ప్రశ్నించారు.
చిరంజీవిని ప్రశ్నించడానికి రక్తసంబంధం అడ్డొస్తుందా? ‘అలాంటివాడివి ప్రజారాజ్యం పార్టీని నడిపించలేకపోయావా? జనసేన ఎందుకు పెట్టావు అని నిలదీశారు.
వీరందరికీ తోడు చంద్రబాబు కూడా పవన్ ను సున్నితంగా విమర్శించారు. పవన్ బీజేపీ దారిలో వెళ్తున్నారని అయన అభిప్రాయపడ్డారు. ప్రశ్నించడానికే పార్టీని స్థాపించాను అంటున్న పవన్ కల్యాణ్ ఇంతవరకూ కేంద్రాన్ని ఒక్కసారైనా ప్రశ్నించారా? అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసోకుండా మాట్లాడుతున్నారన్నారు.