అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేతలపై వేటు వేసేంత వరకు తాము సభలకు వచ్చేది లేదని గతంలో వైసీపీ ప్రకటించింది. కానీ మధ్యలో రాజ్యసభ ఎన్నికలు ఉండటంతో స్పీకర్ కోడెల ఆహ్వానంతో ఒకరోజు ఆపార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ఓటువేసారు. గతంలో సభకు రావాలని స్వయంగా స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఫోన్ చేసి మరీ ఆహ్వానించినా జగన్ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసేంతవరకూ అసెంబ్లీకి వచ్చేది లేదని తేల్చి సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ అసెంబ్లీ వర్షకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ హాజరుకావాలని స్పీకర్, జగన్ను మరోసారి కోరే అవకాశం ఉంది. అయితే సమావేశాల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ స్పీకర్ ఆహ్వానం మేరకు సభకు వెళతారా.? లేక స్పీకర్ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసి జగన్ ను ఆహ్వానిస్తారా అనేది వేచి చూడాలి.
