కేరళ వరదలలో చిక్కుకున్న తెలంగాణ వైద్య విద్యార్థినులు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత చొరవతో వారి స్వస్థలాలకు క్షేమంగా చేరారు. ఖమ్మం పట్టణానికి చెందిన మౌర్య రాఘవ్, వరంగల్ కు చెందిన షారోన్ శార్వాణిల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెడిసిన్ చదివి ఎండీ చేయడానికి కోచింగ్ కోసం కేరళలోని కొట్టాయం వెళ్ళిన వీరు ఉంటున్న హాస్టల్ ప్రాంతం ముంపునకు గురైంది. తెలిసిన ప్రొఫెసర్ సహాయంతో మరో చోటికి మారి 3వ అంతస్తులో ఉన్నారు. అక్కడి నుండి తమ పరిస్థితిని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు నిజామాబాద్ ఎంపీ కవితకు సమాచారం అందించారు. అలాగే మంత్రి కేటీఆర్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఎంపీ కవిత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే కేరళ అధికారులకు సమాచారమిచ్చారు. మంత్రి కేటీఆర్ కూడా కేరళ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులను అప్రమత్తం చేశారు.
రైలు మార్గం పునరుద్ధరించడంతో నిన్న రాత్రి కొట్టాయం నుండి ఖమ్మం, వరంగల్ చేరారు ఇరువురు వైద్య విద్యార్థినులు. ఎంపీ కవిత ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేడు ఖమ్మం వెళ్లి మౌర్య రాఘవ్ ను పరామర్శించారు. పెద్ద విపత్తు నుండి బయటకు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తల్లిలాగా తమ సమస్యను అర్ధం చేసుకొని ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ పరిస్థితి వాకబు చేసిన ఎంపీ కల్వకుంట్ల కవితకు డాక్టర్ మౌర్య, ఆమె తల్లి మంజుల కృతజ్ఞతలు తెలిపారు.
కేరళలో తాము పడిన ఇబ్బందులను మౌర్య మీడియాకు తెలిపారు. మూడు రోజుల పాటు కూరగాయలు దొరకకపోవడంతో దుంపలు ఉడికించుకొని తిన్నామని చెప్పారు. కొట్టాయంలో ఎక్కువ ప్రాంతాలు నీట మునగడంతో రైల్వే స్టేషన్ కు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని తెలయడంతో తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు అక్కడి కలెక్టర్ ప్రత్యేక ఎస్కార్టుతో రైల్వే స్టేషన్ కు చేర్చారని వివరించారు. ప్రభుత్వం తమపై చూపించిన చొరవ పట్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని డాక్టర్ మౌర్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర వాసి కావడం గర్వంగా ఉందని మౌర్య ఎంపీ కవితకు రాసిన లేఖలో తెలిపారు.
మౌర్య కుటుంబ సభ్యులను కలిసిన వారిలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు పసుల చరణ్, జిల్లా నాయకులు రవికిరణ్, గట్టు కరుణ, వనం నాగేంద్ర, వీరభద్రరావు, అరవింద్ రెడ్డి, మనోజ్ తదితరులు ఉన్నారు.