ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో బ్రాడ్ నిబంధనలు అతిక్రమించినట్లు ఐసీసీ అధికారులు గుర్తించారు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించారు.
అసలు ఏం జరిగిందంటే… ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రెండో రోజు ఆటలో 92వ ఓవర్లో బ్రాడ్ వేసిన బంతికి అరంగేట్ర ఆటగాడు రిషబ్ పంత్ ఔటయ్యాడు. పంత్ క్రీజును వదిలి పెవిలియన్‌కు వెళ్లే సమయంలో బ్రాడ్ అతని వైపు చూస్తూ ఏవో వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా కెమెరాలో రికార్డయ్యింది. గమనించిన ఐసీసీ అధికారులు దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బ్రాడ్‌ను పిలిచి ప్రశ్నించగా తాను వ్యాఖ్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. బ్రాడ్ నేరాన్ని అంగీకరించడంతో మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు వారు తెలిపారు.
భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు బుధవారం చివరి రోజుకు చేరుకుంది. ఒక్క వికెట్ తీస్తే చాలు భారత్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకోనుంది. ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్‌లో జరిగిన రెండు టెస్టుల్లో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది.