తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభా బహిష్కరణ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రెండు నెలలపాటు సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేయడంతో.. డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాదీ, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను రెండు నెలల పాటు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. తర్వాత విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. అయితే ఈ రోజు వెలువడిన హైకోర్డు డివిజన్ బెంచ్ తీర్పుపై మరోసారి కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.