‘‘హరిత పాఠశాల-హరిత తెలంగాణ’’ నినాదంతో తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన భారీగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 24వ తేదీన బాలికా ఆరోగ్య రక్ష(హెల్త్ అండ్ హైజీన్) కిట్స్ ను కూడా 31 జిల్లాల్లో పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీనుంచి చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోజు సచివాలయంలో విద్యా సంస్థల్లో హరితహారం, బాలికా ఆరోగ్య రక్ష(హెల్త్ అండ్ హైజీన్) కిట్స్ పంపిణీపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
భవిష్యత్ తరాలకు బంగారు భవితవ్యాన్ని అందించాలంటే పర్యావరణాన్ని రక్షించాలనే గొప్ప ఉద్దేశ్యంతో సిఎం కేసిఆర్ రూపొందించిన హరితహారం కార్యక్రమాన్ని నాల్గవ దశలో భాగంగా విద్యా సంస్థల్లో ‘‘ హరిత పాఠశాల-హరిత తెలంగాణ’’ పేరుతో ఈ నెల 25వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇందుకోసం ఈ రోజు(21.08.2018) సాయంత్రం 31 జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యా సంస్థల్లో కావల్సిన మొక్కలు, 25వ తేదీన జరిగే హరిత పాఠశాల-హరిత తెలంగాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారుల మధ్య సమన్వయంపై స్పష్టమైన ఆదేశాలు జిల్లాలకు ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ విద్యాశాఖలో హరిత హారం నిర్వహించేందుకు విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్ లను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు గ్రీన్ బ్రిగేడ్ల కోసం దుస్తులు, టోపీలు, రుమాళ్లు సమకూర్చాలన్నారు. విద్యాశాఖ పరిధిలోని పాఠశాల, ఉన్నత విద్య, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, బీ.ఈడి కాలేజీలు, డి.ఈడీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్శిటీలలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులున్నారని తెలిపారు.వీరికి దాదాపు కోటి పూలు, పండ్ల మొక్కలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రహరీ గోడల పక్కన వీలైనన్ని వరుసల్లో మొక్కలు నాటే విధంగా అక్కడ గుంతలు తీసి సిద్ధం చేయాలన్నారు. విద్యా సంస్థల్లో ఆటస్థలాలు మినహాయించి మిగిలిన ఖాళీ స్థలాల్లో దాదాపు కోటి మొక్కలను బ్లాక్ ప్లాంటేషన్ చేయాలన్నారు.
విద్యా సంస్థల్లో హరితహారాన్ని విజయవంతం చేయడంలో భాగంగా విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్ లను తయారు చేసి వారికి పర్యావరణంపై అవగాహన పెంచాలన్నారు. ప్రతి నాల్గవ శనివారం విద్యా సంస్థల్లో ఇప్పటికే తాము స్వచ్ఛ పాఠశాల- హరిత పాఠశాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడం, వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం,పాఠశాలనంతటిని శుభ్రంగా ఉంచుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో ఎక్కువగా బతుకుతున్న మొక్కల శాతం విద్యా సంస్థల్లోనే ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇటీవల తాను జనగామా జిల్లా కొడకండ్ల గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి రెసిడెన్షియల్ పాఠశాలలో వెయ్యి మొక్కలు నాటి వెయ్యి మొక్కలను పరిరక్షించారని,ఇప్పుడు పాఠశాలంతా పచ్చదనంతో పర్చుకుని ఉందన్నారు. మిగిలిన విద్యా సంస్థలను కూడా ఈ విధంగా అభివృద్ధి చేసేలా కృషి చేయాలన్నారు.
24వ తేదీనుంచి బాలికా ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ
పాఠశాల, కళాశాల బాలికల ఆరోగ్య రక్షణ, పరిశుభ్రత కోసం ఉద్దేశించిన బాలికా ఆరోగ్య రక్ష(హెల్త్ అండ్ హైజీన్) కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో వారం రోజుల పాటు 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ఆరు లక్షల మంది విద్యార్థినిలకు ఈ బాలికా ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ ఉంటుందన్నారు.
రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్,ప్రభుత్వ, మోడల్ స్కూల్స్, గురుకుల,కేజీబీవీ, పంచాయతీరాజ్ పాఠశాలలన్నింటిలో ఈ కిట్లను అందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ కిట్స్ లలో ఆడపిల్లలకు కావల్సిన అన్ని వస్తువులున్నాయన్నారు. 12 నెలలకు సరిపడే విధంగా ఏడాదికి నాలుగుసార్లు ఈ కిట్స్ అందిస్తామన్నారు. ఒక్కో విద్యార్థిపై ఈ కిట్స్ ద్వారా ఏటా 1600 ఖర్చు చేస్తున్నామని, ఆరు లక్షల మందికి ఏటా 100 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామన్నారు. ఆడపిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సిఎం కేసిఆర్ ఈ పథకానికయ్యే వంద కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు.
ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా,ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పి.కె జా, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ కమార్, చీఫ్ ఇంజనీర్ మల్లేషం ఇతర అధికారులు పాల్గొన్నారు.