ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు శుభవార్త. ఎగువ నుంచి భారీ వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుండటంతో ఈ ఖరీఫ్ కు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జలసౌధలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , మిషన్ భగీరథ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాఠిల్, ఈఎన్సీ మురళీధర్, ఇరిగేష్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇరిగేషన్ ప్రత్యేకాధికారి కే. ప్రసాద్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో శ్రీశైలం, ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరి పూర్తి స్థాయి నీటితో జలకళ సంతరించుకోవడం పట్ల మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ఖరీఫ్ కు నీరు విడుదల చేయాలని మంత్రులు తీర్మానించారు. ఎస్సారెస్పీ కింద కాకతీయ కాలువ, లక్ష్మీకాలువతో పాటు లక్ష్మీ కాంప్లెక్స్ లోని చౌటుపల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్ లకింద ఆయకట్టు, సరస్వతీ కెనాల్ కాలువ, గుత్ప, ఆలీసాగర్, ఐడీసీ ఆధ్వర్యంలో నడిచే 24 లిఫ్ట్ ల పరిధిలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 49 టీఎంసీల నీరు ఉందని, ప్రస్తుత రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుందని, ఈ ప్రవాహం మరి కొద్ది రోజలు నిలకడగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు పరిధిలోని కాలువ పరిధిలోని చెరువులను, కుంటలను నీటితో నింపాలని మంత్రి హరీశ్ రావు ఇంజనీర్లను ఆదేశించారు. ఎస్సారెస్పీకి ఎగువన వరద నీరు ఏయే ప్రాజెక్టుల్లోకి నీరు వస్తుందని, వర్షపాతం ఎలా ఉందని మంత్రులు ఆరా తీశారు. ఎగువన ఉన్న విష్ణు పురి ప్రాజెక్టు, అంధురా బ్యారేజి, బలెగాం బ్యారేజి, బాబ్లీ బ్యారేజి నుంచి వరద ప్రవాహం ఎస్సారెస్పీ చెరుతుందని ఇంజనీర్లు తెలిపారు. వరద నీరు ఎస్సారెస్పీకి చేరతుండటం పట్ల మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఇంజనీర్లు నీటి విడుదల షెడ్యూల్ తయారు చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశం.
———————————————
ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. అందుకు అనుగుణంగా నీటి విడుదల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీర్ ఇన్ చీఫ్ ను మంత్రి ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఇంజనీర్లు రైతులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి…నీటి విడుదల ప్రణాళికలు వివరించాలన్నారు. కాలువ పరిధిలో రైతులకు నీటి విడుదల సమాచారం అందించేలా ఇంజనీర్లు, రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో టాం టాంలు, చాటింపు వేయించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. నీరు విడుదల చేసే కాలువులను పటిష్ట పరిచాలని, కాలువల పూడికను ఉపాధి హామీ పథకంలో భాగంగా తీయాలని సూచించారు. నీటి వృధాను అరికట్టేందుకు టెల్ టూ హెడ్, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిని అవలంబించాలన్నారు. గత రబీలో ఈ పద్ధతి అమలు చేయడం ద్వారా ఒక్క టీఎంసీ నీటితో 13 వేల నుంచి 14 వేల ఎకరాలకు నీరు ఇవ్వగలిగామన్నారు. రైతులు సైతం ఈ పద్ధతి వల్ల ఎక్కువ దిగుబడి సాధించామని ఆనందం వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. ఈ ఖరీఫ్ లో నీటిని టెల్ టూ హెడ్, ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో వినియోగించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రులు అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్టుల్లో నీరు…కాంగ్రెస్ కళ్లలో కన్నీరు..
————————————————–
తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని మంత్రులు ఈ సమీక్షలో అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నారని… ప్రాజెక్టుల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో దేవుడు సైతం కరుణించి చక్కగా వర్షం కురిపించడం వల్ల ప్రాజెక్టుల్లోకి వరద నీరు వస్తోందని మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా గోదావరి బేసిన్ లో నీళ్లుంటే, కృష్ణా బేసినలో నీరు ఉండేది కాదని, కృష్ణా బేసిన్ లో నీరు ఉంటే…గోదావరిలో నీరు ఉండేది కాదన్నారు. కాని ఈ దఫా రెండు బేసిన్లలో వరద నీరు రావడం, ప్రాజెక్టులు నిండటం తొలి సారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రాజెక్టుల్లోకి నీరు వస్తోంటే…కాంగ్రెస్ నేతల కళ్లల్లో కన్నీరు వస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు నీళ్ల రాజకీయాలు చేయాలని చూశారని…కాని దేవుడు సీఎం పాలన దీవించి…వర్షాలతో కరుణించారని చెప్పారు.