ముస్లింల పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి. ఈదుల్..అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సి ఉంటుంది. ఈనెలలో ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు. హజ్ యాత్ర సౌదీఅరేబియాలోని మక్కాకు చేరుకుని మస్జిద్.. ఉల్.. హరామ్‌లోవున్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు చేస్తారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా (ముహమ్మద్ ప్రవక్త సమాధి ఉన్ననగరం)ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ ను కొలుస్తారు.