జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కంటే ఆయన అన్న, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఎన్నోరెట్లు బలవంతుడని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు కనీసం ఒక్కసీటైనా వస్తుందో రాదో తనకు అనుమానమేనన్నారు. చిరంజీవిపై ఎలాంటి వివాదాలు లేవని, కానీ పవన్ కళ్యాణ్ వివాదాల చుట్టే తిరుగుతున్నారని నాని అన్నారు. ఎంతో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, మంచిపేరు ప్రఖ్యాతులు ఉండి కూడా చిరంజీవి అప్పటి సమైక్య రాష్ట్ర్లంలోనే కేవలం 18 సీట్లు మాత్రమే సంపాదించుకున్నారని, అలాంటప్పుడు చిరంజీవి కన్నా తక్కువ ఫాలోయింగ్ ఉండి, పవన్ గెలుస్తారని ఎలా నమ్మగలమని ప్రశ్నించారు నాని. తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకోవాలనుకోలేదని, కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని, నారా లోకేష్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకొని కుటిల రాజకీయాలకు చేస్తున్నారని నాని అన్నారు. కనీస రాజకీయ పరిణితి లేక పవన్ కళ్యాణ్ తనకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారని.. అందుకే చంద్రబాబుపై విమర్శలు కురిపిస్తున్నారని నాని అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే.. అందులో పూర్తిస్థాయిలో పాల్గొంటానని చెప్పిన పవన్ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారని నాని విమర్శించారు. పవన్, బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్నారేమోనని తనకు అనిపిస్తుందని కూడా నాని అన్నారు. అంటే పవన్ రాజకీయ గమనంలో క్లారిటీ లేదంటూ వ్యాఖ్యానించారు కేశినేని.
