తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఢిల్లీ వేదికగా బలంగా గళం వినింపిచారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన 32వ జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నదుల అనుసంధానం పై ఢిల్లీలో సుదీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధిగా హాజరైన మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రయోజనాలను స్పష్టంగా తెలియజెప్పినట్లు వివరించారు. అనంతరం మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పామని తెలిపారు.
తెలంగాణ అవసరాలు తీర్చిన తర్వాత మిగిలిన నీటిని తీసుకోవడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణకు కేటాయించిన 954 టీఎంసీల నికర జలాలు పోగా మిగిలిని నీటిని తీసుకోండని చెప్పామనీ తెలిపారు. తమ ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వకుండా నదుల అనుసంధానానికి డీపీఆర్ తయారు చేయడాన్ని గట్టిగా వ్యతిరేకించినట్లు హరీష్‌రావు చెప్పారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు జరిగాక నదుల అనుసంధానంపై ఆలోచించాలని సమావేశంలో స్పష్టం చేసినట్లు మంత్రి అన్నారు . ఇదే అంశాన్ని రాతపూర్వకంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అందించామని పేర్కొన్నారు.
సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు త్వరగా ఇవ్వాలని కోరామని మంత్రి హరీష్ రావు తెలిపారు. జాతీయ హోదా దేశంలో ఏ ప్రాజెక్టులకు ఇవ్వడం లేదని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి చెప్పారని అయితే. ప్రాజేక్టులకు 60:40 నిష్పత్తిలో గ్రాంట్లు ఇస్తామని చెప్పిన విషయాన్ని కేంద్ర మంత్రికి మంత్రి హరీష్ రావు గుర్తు చేశామని చేప్పారు. మహారాష్ట్రలో కొన్ని ప్రాజెక్టులకు గ్రాంట్లు ఇచ్చినట్లుగానే, తెలంగాణకు గ్రాంట్లు ఇవ్వాలని కోరామని మంత్రి తెలిపారు.