ప్రజామోదాన్ని పొందలేని కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్ అసంబద్ధమైన, అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ అబద్దాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో సీనియారిటీ కన్నా సిన్సియారిటీ ముఖ్యమని ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.
“మా కేటీఆర్‌కు సీనియారిటీ లేకున్నా సిన్సియారిటీ ఉంది. టీఆర్ఎస్‌కు ప్రజలకు అంకితభావంతో పాలన అందించడం తప్ప మరో పని లేదు. కేటీఆర్ సహా టీఆర్ఎస్ నేతలంతా ఉద్యమ కేసుల్లో తిరుగుతుంటే అవినీతి కేసుల్లో కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారు. దేశంలో కాంగ్రెస్ నేతలంతా అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలియదా?“ అని బాల్క సుమన్ ప్రశ్నించారు. ఉత్తమ్ పచ్చ కామెర్లు ఉన్న వాడిలా వ్యవహరిస్తున్నారని సుమన్ మండిపడ్డారు. “అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్. రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో పాటియాలా హౌస్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఉత్తమ్ కారులో మూడు కోట్ల రూపాయలు కాల్చింది నిజం కాదా?..
డబ్బు మదంతో ఉద్యమకారుడు శ్రీకాంత చారీ తల్లిని ఉత్తమ్ ఓడించలేదా? కేటీఆర్ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొంటున్నారు ..దీనికి సాక్ష్యాలెన్నో ఉన్నాయి. ఉత్తమ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారనడానికి ఒక్క ఆధారాన్నయినా చూపగలరా?“ అని ప్రశ్నించారు. కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరి పార్టీ ని గొప్పగా గెలిపించారు దానికి స్పందించకుండా పోయింది ఉత్తమ్ కాదా? అని సుమన్ నిలదీశారు. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తించడం కేటీఆర్ వల్లే సాధ్యపడిందని, ప్రపంచ యవనిక మీద హైదరాబాద్ చిత్రపటాన్ని నిలబెట్టింది కేటీఆర్ అని స్పష్టం చేశారు. టీ హబ్ కేటీఆర్ ఆలోచన నుంచి పుట్టిందేనని అన్నారు.
Tags balka suman kcr ktr mlas mp N. Uttam Kumar Reddy telanganacmo tpcc trs