నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఎమ్మెల్యే కోరుగుంట్ల రామకృష్ణ ప్రవర్తనతో వెంకటగిరి చైర్‌పర్సన్ దొంతు శారద పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. చైర్ పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఆమె ముక్కుసూటిగా వ్యవహరిస్తుండటం ఎమ్మెల్యేకు నచ్చడం లేదట. అంతేకాకుండా, మున్సిపల్ పనుల్లో తాను చెప్పిన వారికే కాంట్రాక్టు పనులు ఇవ్వాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చెప్పినా శారద పట్టించుకోకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించారట.
తాను నియోజకవర్గానికి ఎమ్మెల్యేనని, నేతలందరూ కూడా తన మాట వినాల్సిందేనని ఎమ్మెల్యే రామకృష్ణ చైర్ పర్సన్ దొంతు శారదకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారట. దీంతో ఇటీవల వెంకటగిరిలో జరిగిన మినీ మహానాడుకు సంబంధించి చైర్ పర్సన్ శారదకు ఆహ్వానం పంపలేదట. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన చైర్ పర్సన్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో జిల్లా మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర జోక్యం చేసుకుని దొంతు శారదను సముదాయించారని సమాచారం. అయినా, ఇద్దరి మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనడం లేదట.
ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో ఎమ్మెల్యే రామకృష్ణ అవినీతి, బెదిరింపులకు సంబంధించి మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. వార్తలు ప్రచురితం వెనుక చైర్ పర్సన్ దొంతు శారద ఉన్నట్టు అనుమానించారట. చైర్‌పర్సన్‌తోపాటు కౌన్సిలర్ల ఎదుటే కాంట్రాక్టర్లను పిలిపించి.. ఎవరికి కమిషన్ ఇస్తున్నారో బహిరంగంగా చెప్పాలని ఆదేశించారట.
అంతేకాకుండా, చైర్ పర్సన్, కౌన్సిలర్లు అవినీతి పరులంటూ ఎమ్మెల్యే ఆరోపించడం చర్చనీయాంశమైంది. అయితే, ఎమ్మెల్యే తీరుపై తీవ్రంగా ఆగ్రహించిన చైర్ పర్సన్, కౌన్సిలర్లు ఆయన అవినీతిని మీడియా ముందు పెడతామంటూ స్టేట్‌మెంట్స్ ఇవ్వడంతో అధిష్టానం అలెర్ట్ అయిందట. అవినీతిపై మీడియాకెక్కితే.. పోయేది పార్టీ పరువేనని అసంతృప్త దూతలను అధిష్టాన నేతలు బుజ్జగించినా ఫలితం లేకపోయింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల మున్సిపల్ సమావేశంలో చైర్ పర్సన్‌కు ప్రత్యేక కుర్చీ వేయరాదంటూ.. కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆదేశించడం మరోసారి వివాదానికి తెర తీసింది. ఎమ్మెల్యే, కమిషనర్ తీరుపై చైర్ పర్సన్ వారద మున్సిపల్ మంత్రి నారాయణకు ఫిర్యాదు చేసినా.. మంత్రి నారాయణ ఎమ్మెల్యే రామకృష్ణకే మద్దతు తెలిపారట. దీంతో టీడీపీలో తమప్రతిష్ట పలుచన కాకముందే.. చైర్ పర్సన్ దొంతు శారద, మరికొందరు కౌన్సిలర్లు పార్టీ మారాలనే ఆలోచేన చేస్తున్నారట . ఆ క్రమంలోనే ఇప్పటికే వెంకటగిరి వైసీపీ నేతలతో చర్చలు కూడా జరిపారట. ఏదేమైనా.. వైసీపీ ప్రభావం ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలో వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్, కన్సిలర్లు వైసీపీలో చేరుతుండటం.. టీడీపీకి పెద్ద దెబ్బేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.