శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, కావలి ప్రతిభా భారతి రాజాం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారే. 2009కి ముందు రాజాం జనరల్ అసెంబ్లీ స్థానంగా ఎచ్చర్ల ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ స్థానాలుగా ఉన్నాయి. దీంతో ఎచ్చర్ల నియోజకవర్గానికి మారిన కావలి ప్రతిభా భారతి 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇప్పటికీ ఆమెకు ఎచ్చర్ల నియోజకవర్గంలో బలమైన అనుచరగణం ఉంది. రాజాం నియోజకవర్గం జనరల్ నియోజకవర్గం ఉన్నప్పుడు కిమిడి కళా వెంకట్రావు 1983, 85, 89 మూ డుసార్లు గెలుపొంది..ఆ తరువాత రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 1999లో ఆయన తమ్ముడు కిమిడి గణపతిని రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకుని.. ఆ నియోజకవర్గంలో తన పట్టును కొనసాగించారు కిమిడి కళా వెంకట్రావు.
స్థానికుడు కావడమే కాకుండా, తూర్పు కాపు నియోజకవర్గ నేత కావడంతో కళా వెంకట్రావుకు రాజాం నియోజకవర్గంలో పట్టు ఉంది. అయితే, 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఈ ఇరువురు నాయకులకు స్థాన చలనం తప్పలేదు. రాజాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో 2009లో కిమిడి కళా వెంకట్రావు ఎచ్చర్లకు మారి.. అక్కడి నుంచి ప్రజా రాజ్యం తరుపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు.
ఇదే సమయంలో కావలి ప్రతిభా భారతి రాజాం ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడి పోయారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి కళా వెంకట్రావు గెలవగా, రాజాం నుంచి ప్రతిభా భారతి ఓడిపోయారు. రాజాంలో తన రెండు దఫాల ఓటమికి కళా వెంకట్రావు సహకార లోపమే కారణమని ప్రతిభా భారతి బలంగా నమ్ముతున్నట్టు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇక అప్పట్నుంచి ప్రతిభా భారతి కళా వెంకట్రావు తీరును అవకాశం ఉన్నప్పుడల్లా తప్పుపడుతూ వస్తున్నారు. వీరి పంచాయతీ తీర్చడానికి చంద్రబాబు ప్రతిభా భారతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఊరడించారు. ఎమ్మెల్సీ పదవి వచ్చినా కూడా.. కళా వెంకట్రావుపై తన అక్కసు తీర్చుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులడం లేదని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.
ఆమె తన పాత నియోజకవర్గం ఎచ్చర్లలో ఒకప్పటి పాత అనుచరులను కూడగట్టి కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా సమావేశాలను ఏర్పాటు చేయిస్తున్నారు. అంతేకాకుండా, కళా వెంకట్రావుకు అనుకూలంగా ముద్రపడిన వారు అవినీతికి పాల్పడుతున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఈ ఫిర్యాదుల వెనుక ప్రతిభా భారతి హస్తం ఉందని కళావెంకట్రావు వర్గం భావిస్తోంది. అందులో భాగంగా కళా వెంకట్రావు చేస్తున్న అవినీతికి సంబంధించి కొన్ని సాక్ష్యాలను కూడా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి చూపించారట ప్రతిభా భారతి. ఇదంతా చూసిన రాజకీయ విశ్లేషకులు టీడీపీ అభ్యర్థులు ఒకరినొకరు ఓడించుకోవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.