పట్టణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేలా సిద్ధిపేటలో అర్బన్, ఆక్సిజన్ పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా మర్పడగ గ్రామ శివారు నాగుల బండ సమీపంలోని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతున్న అర్బన్ పార్కు పనులను ఆదివారం పరిశీలించారు. పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు, మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తేవడమే తన ప్రయత్నమని.. ఆ దిశగా అటవీ శాఖ అధికారులు అర్బన్, ఆక్సిజన్ పార్కులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అర్బన్ పార్కుతో పాటు ఆక్సిజన్ పార్కు పనుల వివరాలపై అటవీ శాఖ అధికారులను ఆరా తీశారు. వేకువ జాము 6 గంటల నుంచి 8 గంటల వరకు అర్బన్ పార్కులో దాదాపు 5 కిలో మీటర్ల మేర కాలి నడకన నడుస్తూ.. అర్బన్ పార్కులో ట్రీస్ ప్లాంటింగ్, గజబ్, లేక్ లాంచ్, పాత్ వే తదితర పార్కు అభివృద్ధి అంశాలపై అటవీ శాఖ అధికారి శ్రీధర్ తో చర్చించారు. అనంతరం మర్పడగలోని సెంట్రల్ నర్సరీని సందర్శించి, నర్సరీలో కలియ తిరిగుతూ.. అక్కడ పెంచుతున్న మొక్కలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి పీకే జాతో ఫోన్ లైనులో గజ్వేల్, సిద్ధిపేటలలో అటవీ విస్తరణ పై దృష్టి సారించాలని మంత్రి హరీశ్ రావు కోరారు.
– శాశ్వత కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల పరిశీలన
సిద్ధిపేట జిల్లా శాశ్వత కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతమయ్యాయి. సిద్ధిపేట శివారులోని దుద్దెడ గ్రామ సమీపంలో నిర్మితమవుతున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆదివారం ఉదయం మంత్రి హరీశ్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లక్షా 20వేల స్క్వేర్ ఫీట్లలో నిర్మితమవుతున్న శాశ్వత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఎప్పటిలోపు పూర్తి చేస్తారని కాంట్రాక్టరును ఆరా తీశారు. కలెక్టరేట్ కార్యాలయంతో పాటు జేసీ, డీఆర్వో క్వార్టర్స్ నిర్మాణ పనులు పరిశీలించారు. అదే విధంగా శాశ్వత పోలీసు కమిషనరేట్ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సమీపంలో నిర్మితమవుతున్న కంటి దావఖాన, టూరిజం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హోటల్ నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయని ఫోను లైనులో ఆరా తీస్తూ.. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
– భూ నిర్వాసితులకు పరిహారం అందజేత
కాల్వల నిర్మాణంలో భూములను కోల్పోతున్న నిర్వాసితులైన.. మీ త్యాగం వెల కట్టలేనిదని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ఆదివారం ఉదయం రంగనాయక సాగర్ రిజర్వాయరు ఎడమ, కుడి కాలువ కింద భూములు కోల్పోతున్న 84 నిర్వాసితులకు మంత్రి చేతుల మీదుగా రూ.3, 47,12, 205 కోట్ల పరిహారం చెక్కులను అందించారు. వీరిలో నియోజక వర్గంలోని చిన్నకోడూరు మండలంలోని ఎడమ కాలువ ద్వారా పిల్ల కాలువలకు సికింద్లాపూర్ గ్రామ రైతులు 12 మందికి రూ.55, 20, 981 లక్షల రూపాయలు, కస్తూరి పల్లి గ్రామానికి చెందిన 35 మంది రైతులకు రూ.1, 44, 92, 776 కోట్ల రూపాయలు, ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన 37 మందికి రూ.1, 09,21, 193 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. నంగునూరు మండలంలోని రాజ గోపాల్ పేట గ్రామంలో కుడి కాలువ కింద భూములు కోల్పోతున్న 29 నిర్వాసితులకు 37, 77, 255 లక్షలు చెక్కులను మంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆయా మండలాలలోని ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.