జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఓ మీడియా సంస్థ అధిపతి జైకొట్టారు. కాకినాడకు చెందిన మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆంధ్రప్రభ పేరుతో దినపత్రికను నడుపుతున్న ముత్తా గోపాలకృష్ణ తన కుమారుడు గౌతమ్‌తో కలిసి జనసేనలో చేరారు. మాదాపూర్‌లోని జనసేన కార్యాలయాన్ని ముత్తా తన కుమారులతో సందర్శించి పవన్‌తో భేటీ అయి కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల నుంచి కార్యకర్తలు, నాయకులు జనసేనలో చేరారు.
ఆంధ్రప్రభను నిర్వహిస్తున్న ముత్తా కుటుంబం ఇటీవల జాతీయ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. గౌతమ్ ఆధ్వర్యంలో ఇండియా అహేడ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ప్రారంభం అయింది. ఈ చానల్ తరఫున పవన్‌కు ప్రచారం కల్పించేందుకు వారు సిద్ధమయ్యారు.కొద్దికాలం క్రితం వారు పవన్ కళ్యాణ్‌తో సమావేశమై ఇండియా అహేడ్‌లో ఒక కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ హోస్ట్‌గా రూపకల్పన చేశామని, ఆ కార్యక్రమంలో చేయడానికి అంగీకరించాల్సిందిగా వారు కోరారు. దీనికి పవన్ కల్యాణ్ అంగీకారం తెలిపారని జనసేన తెలిపింది. అదే విధంగా ముత్తా గోపాల కృష్ణ జనసేనలోకి రావాల్సిందిగా పనన్ కల్యాణ్ చేసిన కోరగా అందుకు ఆయన సమ్మతించారు.
ఈ ప్రాథమిక సమావేశం సందర్భంగానే పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ముత్తా గోపాలకృష్ణకు స్థానం కల్పిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. ముత్తా గోపాలకృష్ణ అనుభవం జనసేనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జనసేన అధినేత అభిప్రాయపడ్డారు.