తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టడం, వాటిని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వక విమర్శలు చేయడం తెలిసిన సంగతే. అందులో భాగమే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమమైన కంటి వెలుగు. దీనిపై తాజాగా ఓ వర్గం దుష్ప్రచారం. అదేంటంటే..“కంటి వెలుగు ఆపరేషన్ వికటించి మహిళా మృతి.. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం దత్తాయిపల్లి గ్రామ పంచాయితీకీ చెందిన అరవై సంవత్సరాల చెన్నమ్మ ఆపరేషన్ వికటించి దుర్మరణం పాలయ్యింది. కంటి వెలుగుకోసమని వైద్య సిబ్బంది చెన్నమ్మను కొత్తూరు సమీపంలో ఉన్న నాట్కో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆపరేషన్ వికటించి మృతి చెందింది. అనేస్తేషియా మత్తు మందు మోతాదుకు మించి ఇవ్వడంతో ఆమె కోమాలోకి జారిపోయింది.ఆమె మృత్యు వాత పడ్డట్టు వైద్యులు నిర్ధారించారు. షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో అధికారులు హుటా హుటిన పోస్ట్ మార్టం నిర్వహించి శవాన్ని బంధువులకు అప్పగించారు.తమ తల్లిని పొట్టన పెట్టుకున్నారని ఆజనేయులు, సాయిలయ్య కన్నీటి పర్యంతం అయ్యారు.ఆరోగ్యాంగా వెళ్లి శవమై తిరిగి వచ్చిందని ఆవేదన చెందారు.“ అంటూ ఓ వర్గం మీడియా ఊదరగొట్టింది.
అయితే ఈ విషయంపై వైద్యారోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. “కేశంపేట మండలం దత్తాయిపల్లి గ్రామానికి చెందిన చెన్నమ్మ కంటి వెలుగు శిబిరానికి వచ్చారు. ఆమెను నాట్కో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి రెఫెర్ చేశారు. కంటి సమస్య పరిష్కారం కోసం సంబంధిత హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ లో అనేస్తేషియా ఇచ్చారు. ఆపరేషన్ కి ముందే, శ్వాస సంబంధ సమస్యలతో చెన్నమ్మ ఇబ్బంది పడినారు. వెంటనే డాక్టర్లు షాద్ నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి పంపించారు. దురదృష్టవశాత్తు చెన్నమ్మ మార్గ మధ్యంలోనే మరణించారు.“ అని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే కంటివెలుగును అబాసు పాలు చేసేలా పలువురు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.