మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య(84) మృతిచెందారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. చెన్నుపాటి విద్య ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున విజయవాడ పార్లమెంట్ నుంచి విద్య రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. ఇందిరాగాంధీ 1979లో తొలిసారి పార్లమెంట్ ఎన్నికల కోసం విజయవాడ టిక్కెట్‌ను విద్యకు కేటాయించారు. 1980 నుంచి 1984 వరకు మొదటిసారి, 1989 నుంచి 1991 వరకు రెండోసారి లోక్‌సభ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తించారు. 1934 జూన్ 5న జన్మించిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. చెన్నుపాటి శేషగిరి రావును 1950లో వివాహం చేసుకున్నారు. విద్యకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విద్య అంత్యక్రియలు సోమవారం విజయవాడలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు.
